పెట్టుబడి లేకుండానే కోట్లు సంపాదిస్తున్న మిల్లర్లు

పెట్టుబడి లేకుండానే కోట్లు సంపాదిస్తున్న మిల్లర్లు
  • ఖాళీ అవుతున్న నిల్వలు 
  • జనాల నుంచి తక్కువ ధరకు రేషన్​బియ్యం కొనుగోలు 
  • ఈ బియ్యమే మళ్లీ ప్రభుత్వానికి..  
  • అధికారులు, లీడర్ల అండతో యథేచ్చగా దందా

వనపర్తి, వెలుగు:  రైతుల నుంచి ధాన్యం కొని మిల్లుల్లో బియ్యంగా మార్చి రేషన్ షాపులకు తరలించే క్రమంలో మిల్లర్లు కోట్లాది రూపాయల అక్రమ దందాకు తెరలేపారు. సంవత్సరం లోపు మిల్లులకు తరలించిన వడ్లను బియ్యంగా మార్చేందుకు సమయం ఉండడంతో ఆ వడ్లను కర్నాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పట్టుబడుతున్న లారీలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొవిడ్  నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా ఒక్కో వ్యక్తికి ప్రతి నెలా 15 కిలోల బియ్యాన్ని ఇస్తుండడంతో ప్రజల వద్ద బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. వీటిని జనాల దగ్గరి నుంచి రూ.6 నుంచి రూ.10కి కిలో చొప్పున కొని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ బియ్యాన్నే సీఎంఆర్ (కస్టమ్​మిల్లుడ్​ రైస్​) కింద చూపించి ప్రభుత్వ స్టాక్ పాయింట్లకు చేరవేస్తున్నారు. 

మిల్లులు నడపకుండానే బియ్యం వస్తోంది 

వనపర్తి జిల్లాలో ప్రభుత్వం 120 మిల్లులకు అనుమతి ఇచ్చింది. 2021–22 యాసంగి సీజన్ లో జిల్లాలో లక్షా 34 వేల టన్నుల వడ్లను రైతుల నుంచి కొని మిల్లుల్లో భద్రపరిచింది. వానాకాలం సీజన్ లో 2 లక్షల 34 వేల టన్నుల సన్న బియ్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చే క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం చొప్పున మిల్లర్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. గత నెల చివరినాటికి మిల్లులన్నీ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉన్నా ఆ పని చేయలేదు.

ఒక్కో రైస్ మిల్​కు సుమారు 5వేల నుంచి 20వేల టన్నుల వడ్లను తరలించగా ఈ నిల్వలు రోజు రోజుకూ తరిగిపోయినట్లు అధికారులు తెలుసుకున్నారు. చాలామంది మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని కర్నాటకు తరలిస్తున్నారని, మిల్లులు నడపకుండానే గ్రామాల్లో కొన్న బియ్యాన్ని తీసుకువచ్చి చూపిస్తున్నారని తెలిసింది. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్లకు ఫిర్యాదు వెళ్లడంతో వనపర్తి జిల్లాలోని మిల్లుల్లో సోదాలు నిర్వహించారు. కానీ, అందులో ఏం బయటపడింది అనేది మాత్రం బయటకు చెప్పడం లేదు. - సివిల్​సప్లయీస్ ​మేనేజర్ ​మాత్రం మిల్లుల్లో ఎలాంటి అక్రమాలు జరిగినట్టు తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు.  

దందాలో అధికార పార్టీ లీడర్లు..అధికారులు 

జిల్లాలోని120 రైస్ మిల్లులకు సీఎంఆర్ అనుమతి ఇచ్చినప్పటికి ఆ పేర్లను రహస్యంగా ఉంచుతున్నారు. వనపర్తి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ లీడర్​ రైతు ప్రతినిధిగా వ్యవహరిస్తూ సీఎంఆర్ తతంగంలో  అధికారులకు, వ్యాపారులకు మధ్య సమన్వయకర్తగా పని చేస్తున్నట్టు తెలిసింది. ఈయన ఈ దందాలో దాదాపు రూ.100 కోట్ల వరకు లావాదేవీలు నిర్వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రైస్ మిల్లులను నడుపుతూ నేరుగా ప్రభుత్వం పంపిన వడ్లను కర్నాటకలో అమ్ముకొని ఆ డబ్బులో కొంతభాగం జిల్లాలోని అధికారులకు ఇచ్చి మేనేజ్ చేశాడని సమాచారం. అంతేగాకుండా జిల్లాకు చెందిన ఓ ముఖ్య అధికారి కూడా అక్రమ దందాకు పాల్పడుతున్నాడని, మిల్లర్ల నుంచి వసూళ్లు చేయడమే కాకుండా ఆయన బంధువులతోనూ రైస్ మిల్లులను ఏర్పాటు చేసి బిజినెస్​లో డైరెక్ట్​గా కాలు మోపారన్న ఆరోపణలున్నాయి. గ్రామాల్లో పంపిణీ చేస్తున్న రేషన్​బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ఆయా మండల స్థాయి అధికారులను సైతం ప్రభావితం చేశారని తెలుస్తోంది. 

ఆటోలకు మైక్​లు పెట్టి మరి...

2020 సంవత్సరంలో కరోనా మొదలైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఒక్కో వ్యక్తికి 15 కిలోల చొప్పున ఇస్తుండడంతో ప్రతి ఇంటికి బియ్యం అవసరానికి మించి చేరుతోంది. ఇదే బియ్యాన్ని కొంటూ మిల్లర్లు దందా చేసుకుంటున్నారు. ప్రతి నెల 3వవారం నుంచి గ్రామాల్లో ఆటోల ద్వారా మైక్ లు పెట్టి బహిరంగంగా రేషన్​ బియ్యం కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లను కర్నాటకలో అమ్ముకోవడంతో పాటు అటు ప్రజల నుంచి కొన్న రేషన్ బియ్యాన్ని ప్రభుత్వానికి అమ్మడం ద్వారా రెండింతల లాభాన్ని పొందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలువురు మిల్లర్లపై ఎన్నోసార్లు కేసులు నమోదయ్యాయి. కొందరిపై పీడీ యాక్ట్ కూడా పెట్టినా దందాను ఆపడం లేదు. 

అన్నీ సక్రమంగానే ఉన్నాయి

జిల్లాలోని మిల్లుల్లో వడ్ల స్టాక్ లోని తేడాలను పరిశీలించేందుకు ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. అయితే అన్ని చోట్లా సక్రమంగానే ఉన్నట్లు తేలింది. వడ్లను మిల్లుల్లో ఆడించకుండా వేరేవాళ్లకు అమ్ముకుంటే క్రిమినల్​కేసులు నమోదు చేస్తాం. బియ్యం రీ సైక్లింగ్ కాకుండా చర్యలు చేపట్టాం. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకుంటున్నాం.  –  కొండల రావు, సివిల్ సప్లయీస్​ మేనేజర్, వనపర్తి