సీఎంఆర్​ పెండింగ్..గడువు దాటినా బియ్యం ఇవ్వని మిల్లర్లు

సీఎంఆర్​ పెండింగ్..గడువు దాటినా బియ్యం ఇవ్వని మిల్లర్లు
  •     2022 వానాకాలానికి సంబంధించి 95 వేల మెట్రిక్​టన్నులు డీలే
  •     యాసంగి సీజన్​2,46,000 మెట్రిక్​ టన్నులకు ఇచ్చింది 23 వేల మెట్రిక్​ టన్నులే

కామారెడ్డి, వెలుగు : ఎన్నిసార్లు గడువు పెంచినా జిల్లాలో కస్టమ్ మిల్లింగ్​రైస్ (సీఎంఆర్) కంప్లీట్​కావడం లేదు. ఇప్పటికైనా టార్గెట్​ రీచ్​అవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  2022 వానాకాలం సీజన్​కు సంబంధించిన సీఎంఆర్​ను మిల్లర్లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అప్పగించలేదు. యాసంగి సీజన్​కు సంబంధించి టార్గెట్​లో 10 శాతం కూడా పూర్తి చేయలేదు. ఉన్నతాధికారులు పలుమార్లు  మిల్లర్లతో మీటింగులు నిర్వహించి గడువు విధిస్తున్నా

పురోగతి కనిపించడం లేదు. జిల్లాలో ప్రతి సీజన్​లో 2 లక్షల నుంచి 2 లక్షల 50 వేల ఎకరాల్లో రైతులు వరి సాగుచేస్తున్నారు. జిల్లాలో 163 రైసుమిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి, ఆయా సీజన్లలో కొన్న వడ్లను మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు మిల్లింగ్​ చేసి నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి బియ్యాన్ని అప్పగించాలి. 

గతేడాది సీఎంఆర్​ ఇంకా రాలే..

గతేడాది వానాకాలం సీజన్​లో ప్రభుత్వం మిల్లర్లకు 4 లక్షల 75 వేల మెట్రిక్ ​టన్నుల వడ్లను అప్పగించింది. దీనికి బదులు మిల్లర్లు 3 లక్షల 18 వేల మెట్రిక్​టన్నుల బియ్యం అప్పగించాలి. ఇప్పటి వరకు 2 లక్షల 23 వేల మెట్రిక్​ టన్నుల బియ్యమే తిరిగిచ్చారు. ఇంకా 95 వేల మెట్రిక్​టన్నుల సీఎంఆర్​రావాలి. సెప్టెంబర్​30లోగా పూర్తిస్థాయి సీఎంఆర్​ఇవ్వాల్సి ఉండగా, పూర్తికాలేదు. డిసెంబర్​31లోగా ఇవ్వాలని గవర్నమెంట్​మరోసారి గడువు విధించింది.

యాసంగి సీజన్ ..పది శాతం కూడా పూర్తి చేయలే..​

గతేడాది యాసంగి లో ప్రభుత్వం మిల్లర్లకు 3 లక్షల 60 వేల మెట్రిక్​ టన్నుల వడ్లను ఇచ్చింది. దీనికి సంబంధించి 2 లక్షల 46 వేల మెట్రిక్​టన్నుల రైస్​ ఇవ్వాలి. ఇప్పటి వరకు కేవలం 23 వేల మెట్రిక్​ టన్నుల రైస్​ వచ్చింది. ఇంకా 2 లక్షల 23 వేల మెట్రిక్​ టన్నులు రావాలి. బియ్యం అప్పగించేందుకు ఇంకా గడువు ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే  కొందరు మిల్లర్లు సీఎంఆర్​ అప్పగించడంలో తీవ్రజాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బియ్యం నిల్వలకు సరిపడా గోడౌన్స్​ లేకపోవడం, ఎగుమతి ఆలస్యమవుతున్న దృష్ట్యా కొన్నిసార్లు సీఎంఆర్​ డిలే అవుతోందని మిల్లర్లు చెబుతున్నారు.

సకాలంలో ఇవ్వాలని ఆదేశించాం

సకాలంలో సీఎంఆర్​ ఇవ్వాలని మిల్లర్లకు ఆదేశించాం. నెలల వారీగా విధించిన గడువు ప్రకారం సీఎంఆర్​తీసుకుంటున్నాం. మధ్యలో కొద్దిగా డిలే అయినప్పటికీ మళ్లీ స్పీడప్​ చేశాం. గడువులోగా ఇవ్వకపోతే మిల్లర్లకు నోటీసులిస్తాం

– అభిషేక్, సివిల్​ సప్లయ్​ డీఎం