యవ్వనాన్ని తిరిగి పొందాలని.. రోజూ 111 టాబ్లెట్లు వేసుకుంటుండు

యవ్వనాన్ని తిరిగి పొందాలని..  రోజూ 111 టాబ్లెట్లు వేసుకుంటుండు
  • కొడుకు రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకుని ప్రయోగం
  • ఏటా రూ.17 కోట్ల దాకా ఖర్చుపెడుతున్న మిలియనీర్

కాలిఫోర్నియా: సంపాదనలో పడి వయస్సు పెరగడాన్ని పట్టించుకోలేదనో లేక మరేదైనా కారణమో కానీ అమెరికా కుబేరుడు ఒకరు యవ్వనాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. రకరకాల వైద్య పరీక్షలు చేసుకుంటూ, శాకాహారంతో కడుపునింపుకోవడంతో పాటు నిత్యం 111 మాత్రలు (విటమిన్ సప్లిమెంట్లు) వేసుకుంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయం వెల్లడించాడు. ఈ ఏర్పాట్ల కోసం ఏటా రూ.17 కోట్లు ఖర్చవుతోందన్నాడు. టీనేజ్​లో ఉన్న కొడుకు రక్తాన్ని ఎక్కించుకున్నాడు.

అమెరికా మిలియనీర్..

అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బ్రయాన్ జాన్సన్ పేమెంట్ కంపెనీ బ్రెయిన్ ట్రీ వ్యవస్థాపకుడు.. దీనిని ఈబేకు 800 మిలియన్  డాలర్లకు అమ్మేశాడు. ప్రస్తుతం 46 ఏండ్ల వయసున్న బ్రయాన్ 18 ఏండ్ల కుర్రాడిలా మారాలని, శరీరంలోని అవయవాలు తిరిగి యవ్వనం సంతరించుకోవాలని వైద్యులను ఆశ్రయించాడు. మొత్తం 30 మంది వైద్యుల బృందంతో ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ పేరుతో రివర్స్ ఏజింగ్​ ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

ఇంట్లోనే పలు వైద్య పరికరాలు, జిమ్​ ఇతరత్రా ఏర్పాట్లు చేసుకుని రోజూ శ్రమిస్తున్నాడు. ఉదయం 5 గంటలకు తన దినచర్య మొదలవుతుందని రాత్రి 8:30 కు బెడ్ పైకి చేరడంతో ముగుస్తుందని బ్రయాన్ చెప్పాడు. రెండేళ్లుగా ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ కొనసాగిస్తున్నానని, తన శరీరంలోని పలు అవయవాలు 18 ఏళ్ల వయసులో ఉన్నట్లు మారిపోయాయని అన్నాడు. తమ ప్రయోగం సక్సెస్ అయిందనేందుకు సూచనలు కనిపిస్తున్నాయని, పూర్తిగా విజయవంతమైతే తనకిక చావనేదే ఉండదని బ్రయాన్ అంటున్నాడు.