
- గతేడాది 5 వేల మందికిపైగా వలస
- అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూపు
- సంపన్నుల వలస జాబితాలో మూడో ప్లేస్‌లో ఇండియా
దేశం నుంచి ఏటా పెద్ద సంఖ్యలో కోటీశ్వరులు విదేశాలకు వలస వెళుతున్నారు. గతేడాది ఏకంగా 5 వేల మంది మిలియనీర్లు ఇండియా వదిలి వెళ్లిపోయారని, దేశంలోని హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్‌లో ఇది 2 శాతానికి సమానమని గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ (జీడబ్ల్యూఎంఆర్) నివేదికలో వెల్లడించింది. ఇలా వెళుతున్న వారిలో చాలా వరకు అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూస్తున్నారని తెలిపింది. అంతేకాదు ఇండియా ఆర్థిక పరమైన అసమానతలతో సతమతం అవుతోందని, దేశంలోని మొత్తం సంపదలో సగం మిలియనీర్ల చేతుల్లోనే ఉందని పేర్కొంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏటేటా ముందడుగు వేస్తున్నామని ఓవైపు మనం చంకలు కొట్టుకుంటుంటే, ఏటా దేశం వదిలి పెట్టిపోతున్న మిలియనీర్ల సంఖ్య మరోవైపు వెక్కిరిస్తోంది. మిలియనీర్లు వదిలి పెట్టి వెళ్తున్న దేశాల జాబితాలో మనం కిందటేడాది మూడో ప్లేస్‌లో ఉన్నాం. సుమారు 5,000 మంది మిలియనీర్లు లేదా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ) ఇండియా వదిలి బయటకు వెళ్లారు. ఇండియాలోని హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్‌లో ఇది 2 శాతానికి సమానమని గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ (జీడబ్ల్యూఎంఆర్) 2019 నివేదిక వెల్లడించింది. ఆఫ్రేసియా బ్యాంక్, రిసెర్చ్ ఫర్మ్ న్యూ వరల్డ్ వెల్త్‌లు కలిసి ఈ రిపోర్టును రూపొందించాయి.
యూకే వద్దంటున్నారు…..
బ్రెక్సిట్ కారణంగా ఇబ్బందులెదుర్కొంటున్న యూకే కంటే మన దేశం నుంచే ఎక్కువ మంది మిలియనీర్లు 2018లో విదేశాలకు తరలి వెళ్లడం విశేషం. గత మూడు దశాబ్దాలుగా చూస్తే, ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అత్యధిక సంపన్నులను తమవైపు ఆకట్టుకునే దేశాల జాబితాలో యూకే అగ్రస్థానంలో నిలిచేది. అలాంటిది, బ్రెక్సిట్‌తో గత రెండేళ్లలో ఈ ట్రెండ్ రివర్సయింది. అమెరికాతో నడుస్తున్న ట్రేడ్‌వార్ కారణంగా చైనా ఈ జాబితాలో మొదటి ప్లేస్‌లో నిలుస్తోంది. అమెరికా తాజా టారిఫ్‌లతో ప్రపంచంలోనే రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థైన చైనాకు ముప్పులు తప్పకపోవచ్చు. గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూలో ఇండియా కంటే ఓ స్థానం ముందు రష్యా నిలుస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది.
అమెరికా, ఆస్ట్రేలియాలే అయస్కాంతాలు….
వలసవెళ్లే సంపన్నులను ఆకట్టుకుంటున్న దేశాల జాబితాలో అమెరికా, ఆస్ట్రేలియాలు ముందు వరసలో ఉంటున్నాయి. ఆర్థికపరమైన అసమానతలతో ఇండియా సతమతమవుతోందని, ఈ అసమానత రేటు ఆందోళనకరమైన రీతిలో పెరుగుతోందని కూడా గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ పేర్కొంది. ఇండియాలోని మొత్తం సంపదలో సగం హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ చేతుల్లోనే ఉందని తెలిపింది. ఈ విషయంలో ప్రపంచ సగటు 36 శాతమైతే, ఇండియాలో ఇది 48 శాతం దాకా ఉందని తేల్చింది. ఏదేమైనా, రాబోయే పదేళ్లలో ఇండియా మొత్తం సంపద గణనీయంగా పెరగనుందని కూడా రివ్యూ పేర్కొంది. సంపద సృష్టిలో యూకే, జర్మనీలను తలదన్నేలా ఇండియా ఉంటుందని వివరించింది. 2028 నాటికి నాలుగో సంపన్న మార్కెట్‌గా ఇండియా రూపుదిద్దుకుంటుందని అభిప్రాయపడింది.
సంపద సృష్టిలో మన హైదరాబాద్ దూసుకెళ్తుంది
ఇండియాలో సంపద సృష్టిలో ముందుండే నగరాలలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. రాబోయే పదేళ్లలో ఢిల్లీ, బెంగళూరులతోపాటు సంపద సృష్టిలో హైదరాబాద్ కూడా ముఖ్యపాత్ర పోషించనున్నట్లు ఈ రివ్యూ వెల్లడించింది. ఫార్మాస్యూటికల్ కాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందడమే కాకుండా, వివిధ రంగాలలో ఎస్‌ఈజెడ్‌లతో హైదరాబాద్ సంపద సృష్టిలో దూసుకుపోతుందని పేర్కొంది. ఐటీ, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగాలలో ఆధిపత్యంతో బెంగళూరు, వివిధీకరణ, కొన్ని కీలక రంగాలలో పటిష్టత కారణంగా ఢిల్లీ నగరాలు ముందుంటాయని తెలిపింది. సంపన్నుల వలస ఇండియా, చైనాలకు పెద్ద సమస్య కాదని కూడా గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ తేల్చింది.