నాలుగుసార్లు ఓడినా ఆగలేదు : మిల్టన్ హెర్షీ

నాలుగుసార్లు ఓడినా ఆగలేదు : మిల్టన్ హెర్షీ

చాక్లెట్లను ఇష్టపడేవాళ్లకు హెర్షీస్ కిసెస్ గురించి తెలిసే ఉంటుంది. మిల్క్ చాక్లెట్, చాక్లెట్ సిరప్ లాంటివి తయారుచేసే హెర్షీస్ కంపెనీ ఇప్పటిది కాదు. దాదాపు వందేండ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ కంపెనీ ఫౌండర్ పేరు హెcర్షీ. అతను చదువుకోకపోయినా తియ్యనైన క్యాండీలు చేయడం మాత్రం నేర్చుకున్నాడు. తన చేతి చాక్లెట్లను ప్రపంచానికి తినిపించాలన్నది అతని కల. లగ్జరీ వస్తువుగా ఉండే చాక్లెట్‌‌‌‌ను అందరికీ చేరువ చేయడం కోసం పదిహేనేండ్లు కష్టపడ్డాడు. తన క్యాండీ బిజినెస్ నాలుగుసార్లు దివాలా తీసినా వెనకడుగు వేయలేదు. ఏదో ఒకరోజు తన చాక్లెట్ల రుచి ప్రపంచానికి నచ్చుతుందని అతనికి తెలుసు.  క్యాండీ సెల్లర్ నుంచి ‘ది క్యాండీమ్యాన్‌‌‌‌’గా ఎదిగిన మిల్టన్ హెర్షీ ఇన్‌‌‌‌స్పైరింగ్ స్టోరీ ఇది.

మిల్టన్ హెర్షీ 1857లో యుఎస్‌‌‌‌లోని  పెన్సిల్వేనియాలో పుట్టాడు. హెర్షీ తండ్రి హెన్రీ.. సెకండ్ హ్యాండ్ వస్తువులు, పశువులు, వెండి.. ఇలా రకరకాల వ్యాపారాలు చేసి డబ్బు పోగొట్టుకున్నాడు. అన్నీ కోల్పోయి చివరికి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడు. వ్యాపారం చేయడం కోసం హెర్షీ ఫ్యామిలీ రకరకాల ప్లేస్‌‌‌‌లు తిరగాల్సి వచ్చేది. దానివల్ల హెర్షీ స్కూల్‌‌‌‌కు వెళ్లడం కుదరలేదు. కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఇంట్లోనే ఉంటూ తండ్రికి ఫార్మింగ్‌‌‌‌లో సాయం చేసేవాడు. 14 ఏండ్ల వయసులో హెర్షీ.. లోకల్ ప్రింటింగ్  కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. ఒకరోజు అనుకోకుండా  ప్రింటింగ్ మెషిన్‌‌‌‌లో అతని టోపీ పడిపోవడంతో హెర్షీ ఉద్యోగం పోయింది. ఆ తర్వాత హెర్షీ వాళ్ల అమ్మ క్యాండీ తయారీ నేర్చుకోమని సలహా ఇచ్చింది. అలా హెర్షీ పెన్సిల్వేనియాలోని లాన్సెస్టర్‌‌‌‌‌‌‌‌లో ఒక క్యాండీ షాపులో జాయిన్ అయ్యాడు. అక్కడ రాయర్ అనే వ్యక్తి దగ్గర నాలుగేండ్ల  పాటు పని చేసి రకరకాల క్యాండీలు తయారుచేయడం నేర్చుకున్నాడు. అలా అప్పటినుంచి హెర్షీకి క్యాండీలు తయారుచేయడంపై ఇంట్రెస్ట్ పెరిగింది.

క్యాండీలు చేస్తూ..

క్యాండీలు చేయడం పూర్తిగా నేర్చుకున్న హెర్షీ సొంతంగా క్యాండీలు చేసి అమ్మాలని అనుకున్నాడు. అప్పట్లో ఫిలడెల్ఫియాలో ‘కంట్రీస్ సెంటెన్నియల్ ఎగ్జిబిషన్’ గ్రాండ్‌‌‌‌గా జరిగేది. అక్కడ ‘స్ప్రింగ్ గార్డెన్ కన్ఫెక్షనరీ వర్క్స్’ పేరుతో క్యాండీ షాపు తెరిచాడు. ఎగ్జిబిషన్ జరిగినన్ని రోజులు క్యాండీలు బాగానే అమ్ముడుపోయాయి. హెర్షీ తయారు చేసిన సాఫ్ట్ క్యాండీ, క్యారమెల్ క్యాండీలు బాగా పాపులర్ అయ్యాయి. కానీ, ఎగ్జిబిషన్ ముగిసిన కొన్నేండ్లకు కస్టమర్లు లేక దాన్ని మూసేయాల్సి వచ్చింది. మొదటి ప్రయత్నం ఫెయిల్ అవ్వడంతో హెర్షీ కాస్త నిరాశ చెందాడు.

యుఎస్ అంతా తిరిగి..

హెర్షీకు కొత్తరకం క్యాండీలు తయారుచేయడం అంటే చాలా ఇష్టం.  అదే తనను మళ్లీ మళ్లీ ప్రయత్నించేలా చేసింది. ఫిలడెల్ఫియాలో ఫెయిల్ అయిన తర్వాత డెన్వర్‌‌‌‌‌‌‌‌లో  మరోసారి తన లక్‌‌‌‌ పరీక్షించుకున్నాడు. బంధువుల నుంచి అప్పు తీసుకుని మరో క్యాండీ షాపు తెరిచాడు. కానీ, అక్కడా అదే పరిస్థితి. కొంతకాలం పాటు బిజినెస్ నడిచినా ఆ తర్వాత దివాలా తీసింది.  ఈ సారి డెన్వర్‌‌‌‌‌‌‌‌లో షాపు మూసివేసి అక్కడ్నుంచి చికాగోకు బయలుదేరాడు. అక్కడ మరో క్యాండీ షాపు తెరిచాడు. అక్కడా బిజినెస్ అంతంత మాత్రంగానే నడిచింది. తక్కువ ధరలో రకరకాల క్యాండీలు దొరికే ఆ రోజుల్లో హెర్షీ తయారుచేసిన కొత్త రకం క్యాండీలపై ఎవరూ అంతగా ఇంట్రెస్ట్ చూపేవాళ్లు కాదు. దాంతో చికాగోలో కూడా సేమ్ సీన్ రిపీట్. కొంతకాలం చూసి మళ్లీ అక్కడి నుంచి బయలుదేరాడు. తన క్యాండీలు ఎక్కడో ఒక చోట సక్సెస్ అవుతాయని హెర్షీ బలంగా నమ్మాడు. ఈ సారి చికాగో నుంచి న్యూయార్క్ వెళ్లాడు. అక్కడ మళ్లీ క్యాండీ షాపు తెరిచాడు. కొన్నేండ్ల తర్వాత అది కూడా దివాలా తీసింది. అలా యుఎస్‌‌‌‌లోని ప్లేస్‌‌‌‌లన్నీ తిరిగి చివరికి తను ఎక్కడైతే క్యాండీలు చేయడం నేర్చుకున్నాడో అక్కడికి.. అంటే లాన్సెస్టర్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు హెర్షీ.

క్యారమెల్ కంపెనీ

అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయ్యి  తిరిగి లాన్సెస్టర్‌‌‌‌‌‌‌‌కు చేరుకునేసరికి హెర్షీకు ముప్ఫై ఏండ్లు వచ్చాయి. ఈ సారి చివరి ప్రయత్నంగా లాన్సెస్టర్‌‌‌‌‌‌‌‌లో క్యాండీ షాపు పెడదామనుకున్నాడు. ఈసారి బంధువులు కూడా అప్పు ఇవ్వడానికి వెనకాడారు. దాంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ‘లాన్సెస్టర్ క్యారమెల్ కంపెనీ’ పెట్టాడు. పదిహేనేండ్లుగా ఫెయిల్యూర్ నుంచి హెర్షీ చాలా తెలుసుకున్నాడు. తక్కువ ధరలో బెస్ట్ క్యాండీలను తయారుచేయడం నేర్చుకున్నాడు. క్యారమెల్‌‌‌‌తో కొత్తకొత్త ప్రయోగాలు చేశాడు. ఈ సారి హెర్షీ క్యాండీలు బాగానే అమ్ముడుపోయాయి. ఇంగ్లండ్ నుంచి లాన్సెస్టర్ వచ్చిన ఒక వ్యక్తి హెర్షీ చేసిన క్యాండీ తిని ఇంప్రెస్ అయ్యాడు. క్యారమెల్ క్యాండీలు బ్రిటన్‌‌‌‌కు పంపాలని పెద్ద మొత్తంలో ఆర్డర్ చేశాడు. అలా లాన్సెస్టర్ క్యారమెల్ కంపెనీ లాభాల బాట పట్టింది. హెర్షీ తన అప్పులన్నీ తీర్చేశాడు. బిజినెస్ మరింత పెంచుకుని వెయ్యిమంది వర్కర్లను పనిలోకి తీసుకున్నాడు. ఇదిలా ఉండగా హెర్షీ మనసు చాక్లెట్‌‌‌‌పై పడింది. అప్పట్లో ‘చాక్లెట్’ అనేది ఒక లగ్జరీ వస్తువుగా ఉండేది. ధనవంతులు మాత్రమే చాక్లెట్స్ తినేవాళ్లు. చాక్లెట్‌‌‌‌ను అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నాడు హెర్షీ. అలా పుట్టిందే హెర్షీ చాక్లెట్ కంపెనీ.

హెర్షీస్ చాక్లెట్ పుట్టిందిలా..

క్యాండీలతో రకరకాల ప్రయోగాలు చేసిన హెర్షీ ఆ తర్వాత చాక్లెట్లపై ఫోకస్ పెట్టాడు. తన క్యారమెల్ కంపెనీని అమ్మేసి 1894లో ‘హెర్షీ చాక్లెట్ కంపెనీ’ పెట్టాడు.  ఫ్రెష్‌‌‌‌గా తీసిన పాలతో చాక్లెట్ తయారుచేసే టెక్నిక్‌‌‌‌ కనిపెట్టాడు. దానికోసం మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్‌‌‌‌ కట్టాడు. మిల్క్ చాక్లెట్ అనే కొత్తరకం చాక్లెట్‌‌‌‌ను ఎలాగైనా మార్కెట్లోకి తీసుకురావాలనుకున్నాడు. నాలుగేండ్లు కష్టపడిన తర్వాత  అనుకున్నవిధంగా 1900లో  హెర్షీ నుంచి మిల్క్ చాక్లెట్ బార్స్ వచ్చాయి. ఈ బార్స్ ఇప్పటికీ మార్కెట్లో కనిపిస్తుంటాయి. దాదాపు వందేండ్లు గడిచిన తర్వాత కూడా హెర్షీస్ బార్స్‌‌‌‌కు పాపులారిటీ తగ్గలేదు. 1903లో హెర్షీ సొంతూరు అయిన పెన్సిల్వేనియాలోని డెర్రీ చర్చ్‌‌‌‌లో చాక్లెట్ ప్లాంట్‌‌‌‌ ఏర్పాటుచేశాడు. హెర్షీస్​ చాక్లెట్లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి.  కంపెనీ చాలా వేగంగా సక్సెస్‌‌‌‌ అందుకుంది. ఇక ఆ తర్వాత హెర్షీ డిక్షనరీలో దివాలా అన్న పదమే లేకుండాపోయింది.

నెంబర్ వన్ చాక్లెట్ కంపెనీగా..

చిన్నసైజులో ఉండే ‘కిసెస్’ అనే చాక్లెట్లను 1907లో  తీసుకొచ్చింది హెర్షీస్​ కంపెనీ. అవి వరల్డ్ వైడ్‌‌‌‌గా పాపులర్ అయ్యాయి.  ఆ తర్వాత మిస్టర్ గుడ్ బార్, హెర్షీస్ సిరప్, చాక్లెట్ చిప్స్, పీనట్ బటర్ కప్స్.. ఇలా బోలెడన్ని ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి. హెర్షీస్ కంపెనీ ఇతరదేశాల్లోని చాక్లెట్ కంపెనీలను కొని తన మార్కెట్ వేగంగా విస్తరించింది. 1945లో హెర్షీ చనిపోయేనాటికి హెర్షీస్​ చాక్లెట్ కంపెనీ.. ప్రపంచంలోనే నెంబర్ వన్ చాక్లెట్ కంపెనీగా ఉంది. హెర్షీస్ కంపెనీ మొదట ఒక డెయిరీ ఫామ్‌‌‌‌లో ఉండేది. కంపెనీ చుట్టూ కూడా డెయిరీ ఫామ్‌‌‌‌లు ఉండేవి.  ఆ తర్వాత అదొక పెద్ద ఇండస్ట్రీగా మారింది. హెర్షీ ఆ ప్రాంతాన్ని సొంతంగా డెవలప్ చేశాడు. ఇళ్లు, చర్చి, రోడ్లు ఇలా ఆ ప్రాంతాన్ని పూర్తిగా మార్చాడు. తర్వాతి రోజుల్లో డెర్రీ చర్చ్ ఊరి పేరు ‘హెర్షీ’గా మారింది. హెర్షీ వ్యాపారం ప్రపంచమంతా వ్యాపించి ఒక పెద్ద చాక్లెట్ సామ్రాజ్యాన్ని సృష్టించింది. చాక్లెట్ రంగంలో హెర్షీ తీసుకొచ్చిన మార్పుకి గుర్తుగా హెర్షీని ‘ది క్యాండి మ్యాన్’ అని పిలిచేవాళ్లు. అలా ప్రపంచానికి తీపి రుచి రూపించిన వ్యక్తిగా హెర్షీ చరిత్రలో నిలిచిపోయాడు.  

టైటానిక్ షిప్ మిస్

హెర్షీ జీవితంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. నిజానికి టైటానిక్ షిప్‌‌‌‌లో హెర్షీ కూడా ప్రయాణించాలి. కానీ, లాస్ట్ మినిట్‌‌‌‌లో షిప్ మిస్సయ్యాడు. అలాగే హెర్షీ ఒక బిజినెస్ మ్యాన్‌‌‌‌గా కంటే ఇతరులకు సేవచేసే వ్యక్తిగా ఎక్కువమందికి తెలుసు. హెర్షీ అనాధ పిల్లల కోసం ‘మిల్టన్ హెర్షీ స్కూల్’ కట్టించాడు. అది ఇప్పటికీ ప్రపంచంలోని బెస్ట్ స్కూల్స్‌‌‌‌లో ఒకటి.  వర్కర్ల కోసం ఇండస్ట్రియల్ స్కూల్, హెర్షీ ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. లాభాల కంటే వర్కర్ల బాగోగుల గురించే ఎక్కువ ఆలోచించేవాడు హెర్షీ. కంపెనీ ఆదాయంలో 40 శాతం ఛారిటీ కోసం వాడేవాడు.  కొత్త మెషినరీని తీసుకొచ్చి లగ్జరీ ఫుడ్‌‌‌‌గా ఉండే చాక్లెట్‌‌‌‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. రెండో ప్రపంచయుద్ధం అప్పుడు అమెరికా సైనికుల కోసం నట్స్‌‌‌‌తో చేసిన ప్రత్యేకమైన చాక్లెట్ బార్స్‌‌‌‌ను పంపేవాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా సక్సెస్ అవ్వకపోతుంటే వేరే బిజినెస్‌‌‌‌కు మారడం లేదా ఉద్యోగంలో చేరడం లాంటివి చేస్తారు చాలామంది. కానీ హెర్షీ ఒకటే ప్రయత్నాన్ని పదిహేనేండ్లపాటు చేశాడు. ఫెయిల్ అవుతున్నా తను నమ్మిన ఆలోచనను మార్చలేదు. అదే తనని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. క్యాండీలు అమ్మడంతో మొదలు పెట్టిన హెర్షీ జర్నీ ప్రస్తుతం లక్షల కోట్లకు చేరుకుంది. హెర్షీ కంపెనీ నెట్ వర్త్ సుమారు 328 బిలియన్ డాలర్లు. ఇప్పటికీ హెర్షీ చాక్లెట్ ఫ్యాక్టరీలో రోజుకి ఏడు కోట్ల హెర్షీ కిసెస్ చాక్లెట్లు తయారవుతుంటాయి. ‘బిజినెస్  ఎప్పుడూ ఒక సేవగానే ఉండాలి’ అని చెప్పే హెర్షీస్ ఈ తరం వాళ్లకు నిజమైన ఇన్‌‌‌‌స్పిరేషన్.