అసెంబ్లీ స్పీకర్‌‌కు ఎంఐఎం కంప్లైంట్‌‌

అసెంబ్లీ స్పీకర్‌‌కు ఎంఐఎం కంప్లైంట్‌‌
  • సొసైటీ నుంచి బహిష్కరించాలన్న భట్టి విక్రమార్క
  • చర్యలపై స్టడీ చేస్తున్న స్పీకర్‌‌ ఆఫీస్‌‌

హైదరాబాద్​, వెలుగు: గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్ శాసనసభ సభ్యత్వంపై వేటు పడుతుందా..? అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్​ యూ ట్యూబ్​లో పోస్ట్​ చేసిన వీడియోలోని కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. దీంతో సభా హక్కుల ఉల్లంఘన కింద  ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని, వెంటనే డిస్‌‌క్వాలిఫై చేయాలని అసెంబ్లీ స్పీకర్​కు ఎంఐఎం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీ అసెంబ్లీ  స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డికి లేఖ రాశారు. బుధవారం అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచార్యులును కలిసి ఈ ఫిర్యాదు లేఖను అందజేశారు. మరోవైపు రాజాసింగ్‌‌ను సమాజం నుంచి బహిష్కరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో రాజాసింగ్​పై స్పీకర్ కార్యాలయం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. 

స్పీకర్‌‌ ఏం చేయబోతున్నరు?

స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్‌‌ రెడ్డి నిజామాబాద్‌‌ జిల్లా బాన్సువాడలో ఉండటంతో పాషాఖాద్రీ ఇచ్చిన కంప్లైంట్‌‌ కాపీని ఫ్యాక్స్‌‌ ద్వారా తెప్పించుకున్నారు. రాజాసింగ్‌‌ను డిస్‌‌క్వాలిఫై చేయాలనే ఎంఐఎం ఫిర్యాదుపై స్పీకర్‌‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.  సభ వెలుపల చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం శాసనసభకు ఉందా, గతంలో ఇలాంటి ఉదంతాలు ఏమేం ఉన్నాయి..? అనే వివరాలు సేకరించే పనిలో అసెంబ్లీ సెక్రటేరియట్‌‌, స్పీకర్‌‌ ఆఫీస్‌‌ నిమగ్నమైంది. పాషాఖాద్రీ ఫిర్యాదులో పేర్కొన్న మహారాష్ట్ర ఎమ్మెల్యే డిస్‌‌క్వాలిఫై వ్యవహారం, అందుకు దారితీసిన పరిస్థితులు, ప్రొసీజర్‌‌ అండ్‌‌ కండక్ట్‌‌ ఆఫ్‌‌ బిజినెస్‌‌లో దీనిపై ఎలాంటి పద్ధతులున్నాయి.. అనే అంశాలను స్టడీ చేస్తున్నది. ఎంఐఎం ఫిర్యాదుపై స్పీకర్‌‌ తీసుకునే నిర్ణయానికి తగ్గట్టుగా అవసరమై నోట్‌‌ ఫైల్స్‌‌ సిద్ధం చేసే పనిలో ఉంది. రాజాసింగ్​ శాసనసభ సభ్యత్వంపై వేటు వేసే అధికారం, లేదంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్‌‌ చేసే అధికారం స్పీకర్​కు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏపీలో శాసనసభ వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మొత్తం అసెంబ్లీ ముగిసేవరకు వేటు వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజాసింగ్‌‌ను డిస్‌‌క్వాలిఫై చేస్తారా, అసెంబ్లీ కాలవ్యవధి ముగిసే వరకు సమావేశాలకు హాజరుకాకుండా చర్యలు తీసుకుంటారా? అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.

వేటు వేస్తే మరో ఉప ఎన్నిక

కోమటిరెడ్డి రాజగోపాల్‌‌ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్‌‌పై స్పీకర్‌‌ వేటు వేస్తే మునుగోడుతో పాటు గోషామహల్‌‌ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. తెలంగాణ రెండో అసెంబ్లీ కాలవ్యవధి 2023 డిసెంబర్‌‌ వరకు ఉంది. అసెంబ్లీ కాలవ్యవధి ముగియడానికి 6 నెలల్లోపు ఏదైనా సీటు ఖాళీ అయితే మాత్రమే ఉప ఎన్నిక నిర్వహించరు. అసెంబ్లీ కాలవ్యవధి ఇంకో 16 నెలలు ఉండటంతో ఉప ఎన్నిక తప్పనిసరి. జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో గోషామహల్‌‌ స్థానంలో బీజేపీ సత్తా చాటింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు కూడా ఇదే.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ 2 సీట్లలో ఉప ఎన్నిక జరిగి, నెగెటివ్‌‌ ఫలితాలు వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై టీఆర్‌‌ఎస్‌‌ వర్గాల్లో చర్చసాగుతున్నది.