బీజేపీ, BRS నేతలది మొసలి కన్నీరు.. ధరణి పేరుతో రైతుల భూములు కాజేసిన్రు: మంత్రి లక్ష్మణ్

బీజేపీ, BRS నేతలది మొసలి కన్నీరు.. ధరణి పేరుతో రైతుల భూములు కాజేసిన్రు: మంత్రి లక్ష్మణ్

జయశంకర్ ​భూపాలపల్లి, వెలుగు: పేదల కష్టాలను ఏనాడు పట్టించుకోని బీజేపీ, బీఆర్ఎస్​ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ విమర్శించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం, దూదేకులపల్లి గ్రామాల్లో రూ.4.30 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్లకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.740 కోట్లతో గిరిజన తండాలకు రోడ్లు వేస్తున్నామని తెలిపారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు పెట్రోల్​ బంక్​లు, సోలార్​ పవర్​ ప్రాజెక్టులు అప్పగిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం  ధరణి పేరుతో రైతుల భూములను కాజేసిందని ఆరోపించారు. రైతుల గోస చూడలేక సీఎం రేవంత్​రెడ్డి భూభారతిని తీసుకొచ్చి భూములపై హక్కులు కల్పిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లోని వర్కర్ల సమస్యలు రెండు రోజుల్లో పరిష్కరిస్తామని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్​ రాహుల్​ శర్మ, అడిషనల్​ ఎస్పీ నరేశ్​కుమార్, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్​కుమార్, అంబాల శ్రీనివాస్​ పాల్గొన్నారు.