కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్: డైవర్షన్ పాలిటిక్స్ చేసే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం ఎమ్మెల్యే  సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. 

తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌస్​కే పరిమితమయ్యారని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేటీఆర్, హరీశ్​రావుకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని విమర్శించారు. రూ.5 లక్షల కోట్ల కుంభకోణం అంటూ బావా-బామ్మర్దులు తమ సొంత మీడియా, సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్​విసిరారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బీఆర్ఎస్ ప్రభుత్వమే దెబ్బతీసి, ఉద్యోగులకు ఒకటో తేదీన కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకువచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలో ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తూ అన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అనంతరం జిల్లాలో వడ్ల కొనుగోలుపై సివిల్ సప్లై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు.