అన్ని కమిటీలు భర్తీ చేస్తాం : మంత్రి అడ్లూరి

అన్ని కమిటీలు భర్తీ చేస్తాం : మంత్రి అడ్లూరి
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలి: మంత్రి అడ్లూరి
  • ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: త్వరలోనే అన్ని కమిటీలు భర్తీ చేస్తామని వరంగల్ ఇన్​చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గాంధీభవన్​లో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. మీటింగ్​లో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

 ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేలా ఇప్పటి నుంచే అందరూ క్షేత్ర స్థాయిలో వర్క్ చేయాలి. పార్టీ కోసం కలిసి ముందుకెళ్లాలి. వరంగల్ నేతల మధ్య బేదాభిప్రాయాల అంశంపై చర్చ జరగలేదు. లీడర్ల మధ్య వివాదాలను పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటది’’అని అడ్లూరి అన్నారు. పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ‘‘అభివృద్ధి, సంక్షేమం, పార్టీ సమస్యలపై వరంగల్ జిల్లా నేతల అభిప్రాయాలు తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించాం’’అని సీతక్క తెలిపారు. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు.

గిరిజన బాలికను పరామర్శించిన మంత్రి అడ్లూరి

అనారోగ్యంతో నిమ్స్​లో చికిత్స పొందుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాల స్టూడెంట్​ను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం నేరడిగొండ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆత్రం త్రివేణిపై వేసవి సెలవుల్లో కర్ర మీద పడటంతో తలకు గాయమైంది. ఇటీవల తీవ్రమైన తలనొప్పి రావడంతో మొదడులో రక్తం గడ్డ కట్టిందని నిర్మల్ ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరించారు.

 దీంతో ఆమె నిమ్స్ లో అడ్మిటైంది. ఈ క్రమంలోనే మంత్రి అడ్లూరి ఆమెను పరామర్శించారు. త్రివేణికి అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలిక తల్లితండ్రులతో మాట్లాడి త్రివేణి హాస్పిటల్ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు. మంత్రి వెంట ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డిలు ఉన్నారు.