
తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి ఆరు గ్యారంటీల కోసం గ్రామాల్లో దరఖాస్తులు తీసుకుంటారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీల కోసం అప్లికేషన్లు పెట్టుకునేందుకు కంగారుపడొద్దు.. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో అధికారులు సమాచారం ఇస్తారని మంత్రులు వెల్లడించారు. హైదరాబాద్ లోనూ అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పారు.
జీహెచ్ఎంసీలో వార్డుకు 4 కౌంటర్లు: శ్రీధర్ బాబు
గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 వార్డుల్లో ఒక్కో వార్డులో నాలుగు చోట్ల దరఖాస్తులను సేకరించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో ప్రజాపాలనపై అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో వార్డులో నాలుగు కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తాం. ఒక్కో కౌంటర్‌కు ఒక్కో టీమ్ లీడర్, 7 మంది సభ్యులు ఉంటారు. వార్డులోని ఏ బస్తీ, ఏ కాలనీలో, ఏ రోజు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారన్న దానిపై ముందే సమాచారం ఇస్తారు. ప్రజలు ఆందోళనకు గురికాకుండా దరఖాస్తు చేసుకోవాలి. మహిళలకు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తాం. దరఖాస్తులను నింపేందుకు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. కౌంటర్ ఏర్పాటు చేసిన నాడు దరఖాస్తు చేసుకోకపోయినా.. వచ్చేనెల 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక సెపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశాం” అని ఆయన వివరించారు. గ్రేటర్ లోని 30 సర్కిల్స్ కి స్పెషల్ ఆఫీసర్లను నియమించామన్నారు. వీరు నియోజకవర్గాల వారీగా బుధవారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిసి సమావేశం నిర్వహించి వారి సూచనల మేరకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవాలన్నారు. ‘‘పెన్షన్ అందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజాభవన్ లో దరఖాస్తులు ఇచ్చిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాభవన్ వద్ద ఇప్పటి వరకు 22 వేల దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సేకరించేందుకు కూడా ప్రక్రియ జరుగుతున్నది. అందుకు సంబంధించిన సాఫ్ట్ వేర్ రూపొందించేందుకు సమయం పడుతుంది’’ అని ఆయన తెలిపారు.
- ALSO READ | ఆరు గ్యారంటీలకు ఒక్కటే అప్లికేషన్
అందరి నుంచి అప్లికేషన్లు తీస్కుంటం: పొన్నం
ఆరు గ్యారంటీల దరఖాస్తు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వస్తుందని, ప్రతి కుటుంబం నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని 21 లక్షల మంది ఇండ్లకు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కౌంటర్ల వద్ద ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌ను నేడు సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు.