కరీంనగర్, వెలుగు: దేశ ఆర్థిక వ్యవస్థలో విశ్వకర్మల పాత్ర కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మల అభివృద్ధి, సంక్షేమం కోసం దాదాపు రూ.13 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. కరీంనగర్ లోని మొగ్ధుంపూర్ లో విశ్వబ్రాహ్మణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ భవన ముఖద్వార నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.
అంతకుముందు 41వ డివిజన్ వావిలాలపల్లిలో కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేసి, 46వ డివిజన్ లో కేబీ బంకెట్ హాల్ ను ప్రారంభించారు. మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ వేణు, నాయకులున్నారు.
వేములవాడకు డబుల్ రోడ్డు నిర్మించాలి
బోయినపల్లి : బోయినపల్లి మండలంలోని విలాసాగర్ నుంచి వేములవాడ వరకు డబుల్‌రోడ్డు నిర్మించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి వినతిపత్రం అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎడపెల్లి పర్శరాం, స్తంభంపల్లి సర్పంచ్ అశోక్‌గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రిని కలిసిన సర్పంచులు
బోయినపల్లి మండల సర్పంచులు గురువారం కేంద్ర మంత్రి సంజయ్ ని కలిశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. విలాసాగర్ సర్పంచ్ కనకయ్య, స్తంభంపల్లి సర్పంచ్ అశోక్ గౌడ్ తదితరులున్నారు.
