
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెల్త్ అధికారులు, సిబ్బందిని స్టేట్ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం ఆయన అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పిన ముఖ్యాంశాలను అధికారులకు వివరించారు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు.
జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించండి
ఇన్‌ఫ్లుయెంజా మాదిరి అస్వస్థత(ఐఎల్ఐ), శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ (ఎస్ఏఆర్ఐ) కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీ కి పంపాలని సూచించారు. శనివారం మరోమారు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, వైద్యఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఈ త్రివేణి, అకాడమిక్ డీఎంఈ శివరామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.