వారంలో 96 లక్షల మంది స్టూడెంట్లకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు

వారంలో 96 లక్షల మంది స్టూడెంట్లకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు
  • షేక్‌‌‌‌పేట్‌‌‌‌లో మాత్రలు పంపిణీ చేసిన మంత్రి దామోదర 
  • జాతీయ నులిపురుగుల నివారణ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌‌‌‌లోని షేక్‌‌‌‌పేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 18 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 96.17 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యూబ్లెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. 

రాష్ట్రంలోని 35,700 అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలు, 52,165 పాఠశాలల్లో  నులిపురుగుల నివారణ కార్యక్రమం చేపడతారని, వయసుకు తగిన మోతాదులో ట్యాబ్లెట్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు స్థాయి వైద్య పరీక్షలు, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ.. 1 నుంచి 19 ఏండ్ల వయసు గల పిల్లలకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు అందిస్తామన్నారు. 

నులిపురుగుల వల్ల కలిగే రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా పాఠశాలలు, కళాశాలల్లో ట్యాబ్లెట్లు అందజేస్తామని చెప్పారు. కాగా..మంత్రి దామోదర రాజనర్సింహ నులిపురుగుల నివారణపై రూపొందించిన వాల్ పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటి, పాఠశాల ప్రిన్సిపల్ బాలస్వామి, డీఐఓ డాక్టర్ శ్రీధర్, డీఎంఓ రాములు, తహసీల్దార్ అనితారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

ఎంబీబీఎస్ స్థానికతపై  పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నం

ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానికత అంశంపై కమిటీ సిఫార్సులు చేయనుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌‌‌‌లో స్థానికతకు సంబంధించి సవరణ అవసరమని, శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా షేక్ పేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో మంత్రి మాట్లాడారు. స్థానికత విషయంలో  స్పష్టమైన పాలసీ రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 114 ద్వారా స్థానికత నిబంధనలను నిర్దేశించగా, కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 33 ద్వారా 9 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారిని మాత్రమే స్థానికులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. 

జీవో 33 నిబంధనల ప్రకారం... తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు చదివి, ఇంటర్మీడియట్ కోసం ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో చదివిన విద్యార్థులు నాన్-లోకల్‌‌‌‌గా పరిగణించబడతారు. పునర్విభజన చట్టం ప్రకారం.. 15% అన్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌డ్ కోటా రద్దయిన నేపథ్యంలో కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. జీవో 33 గత రూల్ కంటే మెరుగైనదని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు. 

తొలిరోజు 85 లక్షల మందికి మాత్రలు

నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా తొలిరోజు  85 లక్షల 58 వేల 366 మంది చిన్నారులకు ఆరోగ్య శాఖ ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేసింది. మొత్తం 96 లక్షల లక్ష్యంలో తొలి రోజే 89% మంది చిన్నారులకు మాత్రలు అందాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా తొలి రోజు 85.58 లక్షల మందికి మాత్రలు పంపిణీ చేసిన ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. మిగిలిన చిన్నారులు కూడా తప్పనిసరిగా మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.