సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

 సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఏఐసీసీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర సందర్భంగా అందోల్ మండలం సంగుపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి నియోజకవర్గంలోని ముఖ్యనాయకుల అభిప్రాయాలను అడిగి తెలుకున్నారు. అనంతరం మంత్రి దామోదర మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలు కార్యకర్తల వద్ద  ఉండాలన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇచ్చిన హామీలను  పూర్తిగా  అమలు చేస్తామన్నారు. 

42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇందుకోసం ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద ఆందోళన చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ ఫలితాలు ప్రజలకు అందుతున్నాయ లేదా అని కార్యకర్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మంత్రి సూచించారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్, త్రిష రాజనర్సింహ, గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి, ఆవుల రాజి రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు అంజయ్య, సుహాసిని రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ , సురేందర్ గౌడ్ పాల్గొన్నారు.