
- రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి దామోదర
- పాత కలెక్టరేట్ భవనంలో ఇప్పటికే కొనసాగుతున్న తరగతులు
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కొత్త భవనాలు రాబోతున్నాయి. రెండేళ్ల కింద మెడికల్ కాలేజీ మంజూరు కాగా, అప్పటి నుంచి పాత కలెక్టరేట్ భవనంలో తరగతులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరుకైన భవనాల్లో కాకుండా, భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాలమైన వసతులు కావాలనే ఉద్దేశ్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రఘునాథపాలెం మండలం బల్లేపల్లి శివార్లలో 40 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
రూ.166 కోట్లతో నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ల వైశాల్యంతో మెడికల్ కాలేజీకి కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ భవనాల నిర్మాణానికి ఈనెల 8న గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ నాటికి పనులు పూర్తి చేసుకొని, కొత్త భవనాల్లోనే తరగతులు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇప్పటి వరకు జరిగింది ఇదీ..
2022లో ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరైంది. అప్పటికే ఖమ్మంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుండడంతో పాత కలెక్టరేట్ భవనంతో పాటు, దాన్ని ఆనుకొని ఉన్న ఆర్ అండ్ బీ భవనాన్ని మెడికల్ కాలేజీకి కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న భవనాలను ఉపయోగించుకుంటూనే, ప్రభుత్వాస్పత్రిలో ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనాలను రూ.100 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. వైరా రోడ్ పై పాత కలెక్టరేట్, ఆస్పత్రిని కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రూ.3 కోట్లతో ప్రతిపాదించారు. 2023, 24 విద్యాసంవత్సరం నుంచి పాత కలెక్టరేట్ ఆవరణలో 100 సీట్లతో మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభమయ్యాయి.
పాత డీఎంహెచ్ఓ ఆఫీస్ ను బాయ్స్ హాస్టల్ గా, పాత ఆర్ అండ్ బీ ఆఫీస్ ను గర్ల్స్ హాస్టల్ గా ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో, ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మెడికల్ కాలేజీకి పూర్తిగా కొత్త భవనాలను నిర్మించాలని భావించారు. భవిష్యత్ లో ఇక్కడ మెడికల్ పీజీ కాలేజీ కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంటుందని, విశ్వ విద్యాలయం స్థాయిలో ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలతో రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించి, రఘునాథపాలెం మండలం బల్లేపల్లిలో 40 ఎకరాలను మెడికల్ కాలేజీకి కేటాయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే కొత్త భవనాలకు శంకుస్థాపన కోసం సిద్ధం చేయగా, ఎలక్షన్ కోడ్ రావడంతో వాయిదా పడింది.