భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తం

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తం

హన్మకొండ: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. ఆదివారం హన్మకొండలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల మీటింగ్ లో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం రాకముందు స్థానిక భవన నిర్మాణ కార్మికులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లేవారని చెప్పారు. కానీ కేసీఆర్ పాలనలో వేరే రాష్ట్రాల నుంచే కార్మికులు ఇక్కడికి ఉపాధి కోసం వస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల గురించి కేసీఆర్ పట్టించుకున్నంత... బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పట్టించుకోవడం లేదన్నారు. 

సీఎం సహకారంతో కార్మికుల కోసం జిల్లాకో భవనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు బాగా డిమాండ్ ఉందన్న మంత్రి... కార్మికులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్లను బాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డు ఉండాలని, దాని వల్లే బీమా ప్రయోజనం పొందతారని కార్మికులకు హితవు పలికారు. 60 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి ప్రతి నెలా 5వేల పెన్షన్, వారి పిల్లలకు రిజర్వేషన్లు, విదేశీ విద్య పథకం కింద ప్రయోజనం వంటి కార్మికుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.