త్వరలోనే కొత్త పంచాయతీలకు సొంత భ‌వ‌నాలు

త్వరలోనే కొత్త పంచాయతీలకు సొంత భ‌వ‌నాలు

హైదరాబాద్: నూత‌న‌ గ్రామ పంచాయ‌తీల‌న్నింటికీ ద‌శ‌ల వారీగా భవనాలు నిర్మిస్తామని  రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. అలాగే భ‌వ‌నాలు లేని పాత గ్రామ పంచాయ‌తీల్లోనూ కొత్త భ‌వ‌నాలు నిర్మిస్తామ‌ని ఆయన తెలిపారు. జీపీలకు భవనాలు నిర్మించేందుకు కావాల్సిన నిధులు, విధి విధానాలు వంటి ప‌లు అంశాల‌పై  మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు మినిస్టర్స్ క్వార్టర్స్ లోని త‌న నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో మొత్తం 4 వేల 745 గ్రామ పంచాయ‌తీల‌కు కొత్త భ‌వ‌నాల అవ‌స‌రం ఉంద‌న్నారు. అందులో భవనాలు లేకుండా 1097 తండా జీపీలు,  688 ఏజెన్సీ జీపీలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇక మిగతా ప్రాంతాల్లో  కూడా దాదాపు 2 వేల 960 జీపీలకు సొంత భవనాలు లేవని చెప్పారు.  

ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు అందాల్సి ఉందన్న మంత్రి దయాకర్ రావు... ప్రతిపాదనలు రాగానే దశల వారీగా పంచాయతీ భవనాల నిర్మాణం చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు. ఈ స‌మావేశంలో పంచాయ‌తీరాజ్‌ శాఖ‌ కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజ‌న సంక్షేమ‌శాఖ కార్యద‌ర్శి క్రిష్టినా జెడ్ చొంగ్తు, పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ హ‌నుమంత‌రావు, పంచాయ‌తీరాజ్ ఈఎన్ సీ సంజీవ‌రావు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.