తొమ్మిదేండ్ల డెవలప్​మెంట్​పై వీడియోలు రెడీ చేయండి: మంత్రి ఎర్రబెల్లి

తొమ్మిదేండ్ల డెవలప్​మెంట్​పై వీడియోలు రెడీ చేయండి: మంత్రి ఎర్రబెల్లి
  • పీఆర్​ అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 2 నుంచి 23వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, రూరల్ డెవలప్  మెంట్ శాఖల్లో గత తొమ్మిది ఏండ్లలో జరిగిన మార్పులు, డెవలప్ మెంట్ ను ఈ వేడుకల్లో పబ్లిక్ కు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నర్సరీలు, డంపింగ్ యార్డులు, కల్లాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలపై ఫొటోలు, వీడియోలతో డాక్యుమెంటరీలు రెడీ చేసి పబ్లిక్ కు వివరించాలని మంత్రి ఆదేశించారు.

శుక్రవారం సెక్రటేరియెట్ లో పీఆర్ అధికారులతో మంత్రి దయాకర్ రావు రివ్యూ చేపట్టారు. తొమ్మిది ఏండ్ల కింద గ్రామాలు ఎలా ఉన్నాయి.. ఇపుడు ఎలా ఉన్నాయన్న  వివరాలు డాక్యుమెంటరీల్లో ఉండాలన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు అందుకున్న సర్పంచ్ లు, సెక్రటరీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లను సన్మానించాలన్నారు.