ఈడీ, ఐటీ అధికారులు ఏ డాక్యుమెంట్ అడిగినా ఇస్తా : మంత్రి గంగుల

ఈడీ, ఐటీ అధికారులు ఏ డాక్యుమెంట్ అడిగినా ఇస్తా : మంత్రి గంగుల

కరీంనగర్: ఈడీ, ఐటీ సోదాలపై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి స్పందించారు. దర్యాప్తునకు సహకరించేందుకే తాను వెంటనే దుబాయ్ నుంచి బయలుదేరి వచ్చానన్నారు. విచారణకు హాజరుకావాలని తనకు నోటీసులు అందాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసు అందలేదని స్పష్టం చేశారు. ఒకవేళ దర్యాప్తు అధికారులు ఏ డాక్యుమెంట్ అడిగినా ఇచ్చేందుకు సిద్ధమేనన్నారు. కరీంనగర్ డాక్టర్ స్ట్రీట్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ  మంత్రి గంగుల ఈ వ్యాఖ్యలు చేశారు. 

గ్రానైట్ ఎగుమతుల కుంభకోణం కేసులో..

ఉమ్మడి ఏపీలో జరిగిన గ్రానైట్ ఎగుమతుల కుంభకోణం కేసులో ఈడీ, ఐటీ విభాగాలు  దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా బుధవారం రోజున జాయింట్ ఆపరేషన్ చేపట్టి హైదరాబాద్, కరీంనగర్ లో ఆకస్మికంగా దాడులు చేశాయి. మంత్రి గంగుల కమలాకర్, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లు, ఆఫీసులతో పాటు మరికొందరు గ్రానైట్ వ్యాపారుల ఇండ్లు, ఆఫీసులు, క్వారీల్లో తనిఖీలు చేశారు.

ఇంటి తాళాలు తీయమని చెప్పింది నేనే

ఈనేపథ్యంలో మంత్రి గంగుల  బుధవారం రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈడీ, ఐటీ సంస్థలకు సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వచ్చారని, ఇంటి తాళాలు తీయమని చెప్పింది తానేనన్నారు. ఇంట్లోని ప్రతి లాకర్ని ఓపెన్ చేసి చూసుకొమ్మని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. సోదాల్లో ఎంత క్యాష్ దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో దర్యాప్తు అధికారులే చెప్పాలన్నారు. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివని చెప్పారు. బయటి దేశాల నుంచి డబ్బులు హవాలా మార్గంలో తెచ్చామా అనేది ఈడీ.. డబ్బులు అక్రమంగా నిల్వ ఉంచామా అనేది ఐటీ విభాగం చూస్తోందన్నారు. వీటికి సంబంధించి తమ సంస్థల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మంత్రి గంగుల తేల్చి చెప్పారు.