ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
  • ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
  • బీసీ, సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్

కరీంనగర్‍ సిటీ : దేశం గర్వపడేలా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర బీసీ, సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి జి.కమలాకర్ అన్నారు. గురువారం భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‍లో జిల్లాస్థాయి అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో 3,08,427 గృహాలపై  జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంచాలని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 8 నుంచి 20వరకు  నిర్వహించే కార్యక్రమాలు విజయవంతం చేయడానికి అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. 9వ తేదీ నుంచే జాతీయ పతాకాలు పంచాలని, వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు 8న ఉదయం 7.00 గంటలకు అంబేద్కర్ స్టేడియం నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు.  అనంతరం నగరంలోని ఆర్అండ్ బీ  గెస్ట్ హౌస్ పనులను మంత్రి పరిశీలించారు. అలాగే   జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, టీఆర్​ఎస్​ సీనియర్ లీడర్​బోనాల రాజేశం అనారోగ్యంతో మృతి చెందిడంపై మంత్రి గంగుల, మేయర్‍ సునీల్‍రావు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  సంతాపం తెలిపిన వారిలో ఎంపీ బండి సంజయ్​, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‍ ఉన్నారు.

రాజకీయాలు కాదు అభివృద్ధే ధ్యేయం
కొత్తపల్లి: టీఆర్ఎస్​ప్రభుత్వం రాజకీయాలు చేయదని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుందని మంత్రి కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం ఎలగందల్ లో గీత పారిశ్రామిక సంఘం నిర్మాణానికి గురువారం ఆయన భూమిపూజ చేసి ఈత మొక్కను నాటారు. అనంతరం మాట్లాడుతూ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. గౌడన్నలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం నీరా పాలసీ తెచ్చారని, ఎలగందల్​లో నాలుగు వేలకు పైగా ఈత, తాటి మొక్కలను పెంచేందుకు 5 ఎకరాలు కేటాయించామన్నారు.  అనంతరం ఆయన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, సర్పంచ్ షర్మిల, ఎంపీపీ శ్రీలత- లీడర్లు పాల్గొన్నారు.