జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ మోతే రోడ్డు పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా రూ.62.5 కోట్లు జగిత్యాలకు మంజూరయ్యాయని చెప్పారు. సీనియర్ నాయకులు పనికట్టుకొని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల పట్టణంలో సరైన మాస్టర్ ప్లాన్, లేఅవుట్ లేకపోవడం గత అధికారుల నిర్లక్ష్యం వల్లేనని వివరించారు.
ఎల్‌ఎల్ గార్డెన్ దగ్గర రోడ్డు సౌకర్యం కోసం కోటి రూపాయలతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశామని, అయితే సీనియర్ నాయకులు కల్వర్టు లేదని, రోడ్డు వెడల్పు సరిగా చేయట్లేదని విమర్శలు చేసి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను పరిశీలించకుండా తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. యావర్ రోడ్డును 900 మీటర్లు 100 ఫీట్ల వెడల్పు చేశామని, విస్తరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గతంలో మంత్రిగా అనంతారం బ్రిడ్జికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేశారన్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత ఓటమికి తాను కారణమని అసత్యాలు చెప్పడం సరికాదన్నారు.
