ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

దాడి చేస్తే ప్రతి దాడులకు సిద్ధం

దేశ ప్రజల ఒత్తిడి మేరకే బీఆర్ఎస్

మినిస్టర్​ గంగుల కమలాకర్
 

కరీంనగర్ టౌన్, వెలుగు : ఇన్ని రోజులు బీజేపీ, కాంగ్రెస్ లు ఎన్ని దాడులు చేసినా బాధ్యతగల ప్రభుత్వంగా భరించామని ఇకనుంచి టీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తే ప్రతిదాడులు చేస్తామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. రసమయి పై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. శుక్రవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తెలంగాణ వనరులను దోచుకున్న ఆంధ్ర పార్టీలు షర్మిల, చంద్రబాబు, పాల్ రూపంలో మళ్లీ వస్తున్నాయని, కాళేశ్వరం నీటిని, సింగరేణి విద్యుత్ తో పాటు తెలంగాణ సంపదనంతా దోచుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల ఒత్తిడి మేరకే టీఆర్ఎస్ పార్టీ బీఅర్ఎస్ గా అవతరించిందని పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని మంత్రి అన్నారు. కార్యకర్తలు సీఎం కేసీఆర్​కు సూసైడ్ స్క్వాడ్ గా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక తీరును ఎండగట్టాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలకిషన్, రవిశంకర్, మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ విజయ, డిప్యూటీ మేయర్ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రం సేవలు వినియోగించుకోవాలి : కరీంనగర్​ కలెక్టర్ కర్ణన్ 

తిమ్మాపూర్, వెలుగు : గర్భిణులు అంగన్​వాడీ, ఆరోగ్య కేంద్రం సేవలు వినియోగించుకోవాలని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అంగన్​వాడీ కేంద్రం ద్వారా అందుతున్న భోజనం ఏ విధంగా ఉంద ని గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ చేయించుకోవాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్​ఓ జువేరియా, ఏసీడీపీఓ సరస్వతి, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, తహసిల్దార్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు బాగు చెయ్యాలని గ్రామస్తుల ధర్నా

తిమ్మాపూర్,(మానకొండూరు)  వెలుగు : ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే రోడ్డు గురించి పట్టించుకుంటలేరని అన్నారం రోడ్డును 4 వరుసల రహదారిగా మార్చాలని అన్నారం గ్రామస్తులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానకొండూర్ నుంచి జమ్మికుంట వరకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో కొన్నేళ్ల నుంచి తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​కు చెప్పినా పట్టించుకోకపోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవపూర్ నుంచి మానకొండూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో దుమ్ము ధూళితో ప్రయాణికులు అస్వస్థతకు గురవుతున్నారన్నారు.ఎమ్మెల్యే వచ్చేఆకా ఆందోళన విరమించేదిలేదని రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి గ్రామస్తులను సముదాయించారు. 25వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని స్థానిక సర్పంచ్ కిషన్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. 

పథకాల అమలులో మనమే నంబర్ వన్​ : వినోద్ కుమార్

తిమ్మాపూర్,వెలుగు : రాష్ట్రంలో కొత్త జిల్లాలకు మెడికల్ కాలేజీలతోపాటు 500 పడకల దవాఖానాల నిర్మాణం చేపట్టి సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరుకున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మానకొండూర్ ఎమ్మెల్యే బాలకిషన్, కలెక్టర్ కర్ణన్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో 6,694 డబుల్ ఇండ్లు మంజూరు కాగా 5 వేల ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలో 890 ఇండ్లను మంజూరు చేసుకోగా తిమ్మాపూర్ లో 50 జీ ప్లస్ టు ఇండ్లను పూర్తి చేశామన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. 

10 టన్నుల పీడీఎస్ రైస్ సీజ్

జగిత్యాల, వెలుగు : స్థానిక బుడగ జంగాల కాలనీలో నిల్వ ఉంచిన 10 టన్నుల పీడీఎస్ రైస్ ను పట్టణ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.  కొంత కాలంగా సేకరించిన రైస్ ను బుడగ జంగాల కాలనీలోని ఓ షెడ్ లో నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు డీసీఎంలో రైస్​తరలించేప్పుడు పట్టుకుని స్టేషన్ కు తరలించినట్లు సీఐ కిషోర్ తెలిపారు.

రోడ్డు బాగు చెయ్యాలని గ్రామస్తుల ధర్నా

తిమ్మాపూర్,(మానకొండూరు)  వెలుగు : ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే రోడ్డు గురించి పట్టించుకుంటలేరని అన్నారం రోడ్డును 4 వరుసల రహదారిగా మార్చాలని అన్నారం గ్రామస్తులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానకొండూర్ నుంచి జమ్మికుంట వరకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో కొన్నేళ్ల నుంచి తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​కు చెప్పినా పట్టించుకోకపోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవపూర్ నుంచి మానకొండూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో దుమ్ము ధూళితో ప్రయాణికులు అస్వస్థతకు గురవుతున్నారన్నారు.ఎమ్మెల్యే వచ్చేఆకా ఆందోళన విరమించేదిలేదని రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి గ్రామస్తులను సముదాయించారు. 25వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని స్థానిక సర్పంచ్ కిషన్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. 
కేసుల విచారణలో అలసత్వం వద్దు

సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజన్న సిరిసిల్ల, వెలుగు : కేసుల విచారణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించమని, పెండింగ్​లో ఉన్న కేసులు వెంటనే పరిష్కరించి నేరస్తులకు శిక్షలు పడేలా చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ఆఫీస్​లో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలపై నిఘా పెంచాలన్నారు. అనంతరం విధి నిర్వాహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన 17 మంది అధికారులకు ప్రశంస పత్రాలు అందించారు. సమావేశంలో అడిషనల్​ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రాచారి, రవికుమార్, సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, మొగిలి ,వెంకటేశ్ సిబ్బంది పాల్గొన్నారు.

సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం 

చొప్పదండి,వెలుగు :​ పట్టణంలో రూ.33కోట్లతో చేపడుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను మున్సిపల్ చైర్​పర్సన్ గుర్రం నీరజ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్ కు మున్సిపల్ పాలకవర్గం, పట్టణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జ్యోతి, మహేశ్, అశోక్, కో ఆప్షన్​మెంబర్​అజ్జు, మాజీ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ వైస్ చైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెస్క్యూ పోటీలో ఛాంపియన్​‘సింగరేణి’

గోదావరిఖని, వెలుగు : రాజస్థాన్ లోని మెటల్ మైన్ లో నవంబర్​14 నుంచి 18 వరకు జరిగిన ఆల్ ఇండియా రెస్క్యూ పోటీలలో సింగరేణి జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించింది. రికవరీ వర్క్, ఫస్ట్ ఎయిడ్ లో మొదటి స్థానం కైవసం చేసుకుంది. బెస్ట్ మెంబర్ గా మురళీకృష్ణ ఫస్ట్ ప్రైజ్​సొంతం చేసుకున్నాడు. 

ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మ దహనం

జగిత్యాల, వెలుగు : నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ టీఆర్ఎస్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు ముందు జగిత్యాల తహసీల్ చౌరస్తా లో అరవింద్ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించారు. కవితకు ఎంపి బేషరతుగా కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు భోగ ప్రవీణ్, యువజన అధ్యక్షుడు గిరి, కౌన్సిలర్లు గంగమల్లు, సాగర్, లీడర్లు పాల్గొన్నారు. 

రెండు కిలోల తరుగు తీస్తున్నరు

జగిత్యాల, వెలుగు : తాలు పేరుతో బస్తాకు రెండు కిలోల ధాన్యం తరుగు తీస్తున్నారని నిరసిస్తూ శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో నిజామాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల గడుస్తున్నా తాలు పేరుతో బస్తాకు రెండు కిలోలు తరుగు తీస్తూ ఆలస్యంగా కొనుగోలు జరుపుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు చేయమని అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలని అంటున్నారన్నారు. మిల్లర్ల యూనియన్ తరపున టీఆర్ఎస్ కు రూ.కోటి ఇచ్చామంటున్నారని ఆరోపించారు. అనంతరం పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.  

చందుర్తి : వరి ధాన్యం కొనుగోళ్ల లో తాలు ఉందన్న సాకుతో 40 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని లింగంపేటలో వేములవాడ, కోరుట్ల మెయిన్ రోడ్డుపై శుక్రవారం రైతులు నిరసన తెలిపారు. ఎక్కువ తూకం వేయడం వల్ల క్వింటాలుకు 8 కిలోలు నష్టపోతున్నామన్నారు. సనుగుల సింగిల్ విండో సొసైటీ చైర్మన్ స్పందించాలని డిమాండ్ చేశారు. అవకతవకలపై సింగిల్ విండో సొసైటీ సీఈఓ సమాధానం చెప్పేదాకా ధర్నా విరమించబోమని తేల్చి చెప్పారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

దాడి ఘటనపై బీజేపీ శ్రేణుల నిరసన

వెలుగు, నెట్​వర్క్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడంతో ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ ఆధ్వర్యం లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. పట్టణాధ్యక్షుడు అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లందకుంటలో బీజేపీ మండలాధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.  మల్యాల, లక్ష్మాజిపల్లి సర్పంచ్​లు సాంబయ్య, ఎల్లారెడ్డి, వైస్​ ఎంపీపీ జ్యోత్స్నతదితరులు పాల్గొన్నారు. బీజేపీ వేములవాడ పట్టణా ధ్యక్షుడు రేగుల సంతోష్ అధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నాయకులు హరీశ్,  హనుమాండ్లు, శివ తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో బీజేపీ లీడర్లు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలాధ్యక్షుడు గొట్టే రామచంద్రం, ఎంపీటీసీ ప్రవీణ్, ఉపాధ్యక్షుడు మోహన్ పాల్గొన్నారు. కథలాపూర్​లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ గోపాల్​రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కోరుట్ల ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సురభి నవీన్ తదితరులు పాల్గొన్నారు. మెట్ పల్లిలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ మోరపల్లి సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. పట్టణాధ్యక్షుడు రమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, సుఖేందర్ గౌడ్, సదాశివం, నవీన్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కేసీ ఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. 

‘దేశభక్తి ముసుగులో సంపద అమ్ముతున్నరు’
 

జమ్మికుంట, వెలుగు : దేశభక్తి ముసుగులో కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి దేశ సంపదను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. శుక్రవారం జమ్మికుంట పార్టీ ఆఫీస్​లో నిర్వహించిన జోన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికి కనీసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు కూడా అమలు చేయడంలేదన్నారు. పాలు, పెరుగు, ఇంట్లో వాడే సామగ్రిపై కూడా జీఎస్టీ వేయడం సిగ్గుచేటు అన్నారు. జోన్ కార్యదర్శి అశోక్, సభ్యులు శంకర్, సంపత్ పాల్గొన్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న కనుమల్ల విజయ
టీఆర్​ఎస్​లో బట్టబయలైన విభేదాలు

కరీంనగర్, వెలుగు : టీఆర్ఎస్ బలో పేతానికి శుక్రవారం పట్టణంలో నిర్వహించిన పార్టీ మీటింగ్ లో కరీంనగర్​జడ్పీ చైర్ పర్సన్​కనుమల్ల విజయ కన్నీళ్లు పెట్టుకున్నారు. మినిస్టర్ గంగుల కమాలకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గురించి గోడు వెళ్లబోసుకున్నారు.  ‘ఈటల రాజేందర్ పార్టీలో ఉన్నపుడు యాక్టివ్ గా పని చేసిన విజయ.. ఇప్పుడు ఆ స్థాయిలో పని చేయడంలేదని, పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఉండడంలేదని’ కౌశిక్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ప్రొటోకాల్ లో తనదే పెద్ద పదవని, నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అందుబాటులో ఉండాలని చెప్పినట్లు సమాచారం. దీంతో మంత్రి గంగుల ఆమెను ఓదార్చి తన పక్కనే కూర్చొబెట్టుకున్నారు. 

మీటింగ్​కు నేతల దూరం..
టీఆర్ఎస్ జిల్లా సమావేశానికి చొప్పదండి టీఆర్​ఎస్​ లీడర్లు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండలంలో చేపట్టే కార్యక్రమాలు, పదవుల ఎంపికలో ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని పలువురు టీఆర్ఎస్ లీడర్లు, ప్ర జాప్రతినిధులు ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. చొప్పదండి ఏఎంసీ పాలకవర్గం ఏర్పాటు కారణంగా అసంతృప్తిగా ఉన్న మున్సిపల్ చైర్ ​పర్సన్ నీరజ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసీ  తాజా మాజీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ గంగారెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు వెంకటరమణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రమేశ్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీని యర్ లీడర్లు మీటింగ్​కు దూరంగా ఉన్నారు.అలాగే ఎమ్మెల్యే ప్రొగ్రాంలకు పదిహేను రోజులుగా వీరంతా దూరంగా ఉంటున్నారు.