డెంగీపై ప్రభుత్వం అలర్ట్

డెంగీపై ప్రభుత్వం అలర్ట్
  •     ఆఫీసర్లను అప్రమత్తం చేసిన మంత్రి హరీశ్‌
  •     జ్వరాల మందులన్నీ అందుబాటులో ఉంచండి
  •     ఏవైనా మెడిసిన్లు లేకుంటే లిస్ట్ పంపించండి
  •     మందులు లేవని పేషెంట్లను బయటకు పంపొద్దు
  •     బ్లడ్ సెపరేషన్ మెషీన్లన్నీ వినియోగంలోకి తేవాలె
  •     టీచింగ్ హాస్పిటళ్లలో పేషెంట్ హెల్ప్‌ డెస్కులు పెట్టాలె

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ దవాఖాన్ల సూపరింటెండెంట్లను మంత్రి హరీశ్‌‌‌‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌‌‌‌లో కేసులు ఎక్కువగా ఉన్నందున, ఇక్కడి హాస్పిటళ్లు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లలో జ్వరాలకు సంబంధించిన మందులన్నీ అందుబాటులో ఉంచాలని హెల్త్ ఆఫీసర్లకు స్పష్టం చేశారు. రక్తంలో నుంచి ప్లేట్‌‌‌‌ లెట్స్‌‌‌‌, సీరమ్‌‌‌‌ వేరు చేసే బ్లడ్ సెపరేషన్ మిషన్లు రిపేర్‌‌‌‌‌‌‌‌లో ఉంటే వెంటనే బాగు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఒకవేళ ఎక్కడైనా మిషన్లు అవసరమని భావిస్తే, వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. గురువారం హెల్త్ ఆఫీసర్లు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్పిటళ్లలో ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచి, రోగుల వెయిటింగ్ టైమ్‌‌‌‌ను తగ్గించాలని సూచించారు.

అన్ని హాస్పిటళ్లలో ఫ్యాన్లు, బెడ్‌‌‌‌షీట్లు, మరుగుదొడ్లు సరిపడా అందుబాటులో ఉంచాలని సూచించారు. పేషెంట్లు, వారి అటెండెంట్ల వద్ద శానిటేషన్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేషెంట్లకు పెట్టే భోజన నాణ్యతను సూపరింటెండెంట్లు రోజూ చూడాలని, వార్డుల్లో బోర్డులు పెట్టి భోజన మెనూను పేషెంట్లకు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే, సూపరింటెండెంట్‌‌‌‌ నుంచి డ్యూటీ డాక్టర్ వరకూ అందరి పేర్లు, ఫొటోలు హాస్పిటల్‌‌‌‌ ఎంట్రన్స్‌‌‌‌లో, ఇతర ప్రదేశాల్లో బోర్డుల మీద ప్రదర్శించాలన్నారు. దీంతో భోజనం సరిగా పెట్టకున్నా, డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ లేకపోయినా ఫిర్యాదు చేసేందుకు పేషెంట్లకు, వారి అటెండెంట్లకు అవకాశం కలుగుతుందని చెప్పారు.

జనరిక్‌‌‌‌ మందులే రాయాలె

ప్రభుత్వ దవాఖాన్లలో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నందున, మందుల కోసం రోగులకు బయటికి పంపించొద్దని మంత్రి మరోసారి ఆఫీసర్లు, డాక్టర్లను ఆదేశించారు. ఒకవేళ ఏవైనా మందులు లేకపోయినా, ఇంకేవైనా ఇతర మందులు అవసరమని భావించినా ఒకట్రెండు రోజుల్లో లిస్టు పంపించాలని సూచించారు. ఏ మెడిసిన్ అవసరమైనా సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మందు పేరు(జనరిక్‌‌‌‌) మాత్రమే రాయాలని, బ్రాండ్ పేరు రాసి పేషెంట్లను బయటకు పంపొద్దని కోరారు. కొంత మంది డాక్టర్లు డ్యూటీ టైమ్‌‌‌‌లో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని హాస్పిటళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రొఫెసర్లు తమ డ్యూటీ చార్ట్ ప్రకారం ఓపీ, ఐపీ సేవలు తప్పనిసరిగా అందించాలని, వార్డుల్లో రౌండ్స్ వేయాలని ఆదేశించారు. నల్గొండ టీచింగ్ హాస్పిటల్‌‌‌‌లో నెలకు ఏడొందల కేటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, ఆ హాస్పిటల్ డాక్టర్ పుల్లారావు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. మిగిలిన హాస్పిటళ్లలో కేటారాక్ట్ ఆపరేషన్ల సంఖ్యను పెంచాలని హరీశ్‌‌‌‌ సూచించారు.

హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి: త్వరలో హెల్త్​ కార్డులు

ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్‌‌‌‌ ప్రాజెక్ట్ పూర్తయిందని మంత్రి హరీశ్‌‌‌‌రావు తెలిపారు. త్వరలోనే ఆ జిల్లా ప్రజలకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. గురువారం హెల్త్ ఆఫీసర్లతో మంత్రి రివ్యూ చేశారు. ములుగులో 1.81 లక్షల మంది నుంచి, సిరిసిల్లలో 3.38 లక్షల మంది బ్లడ్ శాంపిల్స్‌‌‌‌ సేకరించామని చెప్పారు. వీలైనంత త్వరగా జనాలకు వారి రిపోర్టులు, హెల్త్ కార్డులు అందజేయాలని సూచించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే, వాళ్లను గుర్తించి, వారి నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించాలని ఆదేశించారు. ఎత్తు, బరువు, బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, కాటరాక్ట్ చెక్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీబీపీ, థైరాయిడ్ వంటి 30 రకాల పారామీటర్స్‌‌‌‌తో హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 5న పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ టెస్టులు ప్రారంభించాలని భావిస్తున్నారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్‌‌‌‌‌‌‌‌ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, డీఎంఈ రమేశ్‌‌‌‌రెడ్డి, ములుగు, సిరిసిల్ల జిల్లాల డీఎంహెచ్‌‌‌‌వోలు పాల్గొన్నారు.

హెల్ప్‌‌‌‌ డెస్కులు పెట్టండి

గాంధీ, ఉస్మానియా వంటి అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో పేషెంట్ హెల్ప్‌‌‌‌ డెస్కులు ఏర్పాటు చేయాలని డీఎంఈ రమేశ్‌‌‌‌రెడ్డిని మంత్రి ఆదేశించారు. వారం రోజుల్లోనే ఇవి పేషెంట్లకు అందుబాటులోకి రావాలని సూచించారు. అలాగే ఓపీ ఎక్కడ చూస్తారు, మందులు ఎక్కడ తీసుకోవాలి, ఏయే టెస్టులు ఎక్కడ చేయించుకోవాలో తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.