
లాక్‌డౌన్ వేళ జనం బ్యాంకుల వద్ద గుమికూడవద్దని.. మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎక్కడికి పోవని హరీష్‌రావు అన్నారు. కరోనా ప్రభావం కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుదారునికి 1500 రూపాయల చొప్పున కేటాయించిందని, కాబట్టి లాక్ డౌన్ రూల్స్ పాటించి ఆ సాయాన్ని అందుకోవాలన్నారు. కరోనా కోసం ఇన్ని రోజులు చేసిన కృషిని వృధా చేయవద్దని కోరారు. గజ్వేల్ నియోజకవర్గంలోని వరదరాజ్ పూర్, సింగాటం గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి గింజకూ మద్దతు ధర వచ్చే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 7 వేల మక్కలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు.
ధాన్యం కొనుగోళ్లకై రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలను కేటాయించిందని హరీష్ రావు అన్నారు. వడ్లు అమ్మిన రైతులకు క్వింటాలుకు 1835 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నాం కాబట్టి రైతులు టోకెన్ తీసుకొని కొనుగోలు కేంద్రానికి రావాలన్నారు. వడ్లు అమ్మిన రైతులకు వారం రోజుల్లో నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి దిగులు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అవసరం ఉన్న ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను జరిపించాలని అధికారులకు సూచించారు.