పార్టీల ఉండి కుట్ర చేసిండు

పార్టీల ఉండి కుట్ర చేసిండు
  • తన స్వార్థం కోసం ఈటల ఎన్నికలు తెచ్చిండు: మంత్రి హరీశ్
  • ఆయనను గెలిపిస్తే ప్రజలు ఓడినట్లే
  • ఇన్నాళ్లూ హుజూరాబాద్​లో డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు ఎందుకు కట్టియ్యలే 
  • అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్​నే గెలిపించాలె
  • ఇల్లందకుంట, వీణవంక సభల్లో కామెంట్స్

రెండున్నర నెలలుగా సిద్దిపేటలో మకాం పెట్టి.. అక్కడి నుంచే హుజూరాబాద్‌లో చక్రం తిప్పుతున్న మంత్రి హరీశ్ రావు నేరుగా రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన రోజే ప్రచారం షురూ చేశారు. వచ్చీ రాగానే తన పాత దోస్త్, బీజేపీ నేత ఈటల రాజేందర్‌‌పై విరుచుకుపడ్డారు. నిన్నటి దాక హుజూరాబాద్​లో రాజేందర్​ఏమైనా పనిచేశాడంటే అదంతా కేసీఆర్ దయ వల్లేనని చెప్పారు. అందుకు ఈటల కూడా దీటుగా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్​కు కావాల్సింది బానిసలు మాత్రమేనని ఫైర్ అయ్యారు. తాను గెలిస్తే ఏం చేస్తానని హరీశ్​రావు లాంటివాళ్లు అంటున్నారని, కానీ తాను రాజీనామా చేశాకే దళితబంధు పథకం వచ్చిందని ఈటల చెప్పారు. 

ఈటల రాజేందర్‌‌ను పెంచి పెద్ద చేసింది కేసీఆర్. రాజకీయ ఓనమాలు నేర్పింది కేసీఆర్.. నాయకుడిగా తీర్చిదిద్దింది కేసీఆర్.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా చేసింది కేసీఆర్.. కానీ తండ్రి లాంటి కేసీఆర్​ను, తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని గుండెల మీద తన్నిండు ఈటల. గులాబీ జెండా నీడలో ఎదిగి.. ఆ పార్టీకే వ్యతిరేకంగా మోసాలు, కుట్రలు చేసిండు. తన స్వార్థం కోసం, తాను రాజకీయంగా ఎదగడం కోసమే ఈ ఎన్నికలు తెచ్చిండు. ఈటలకు ఓటువేస్తే ప్రజలకు ఏం చేస్తాడో సూటిగా చెప్పాలి. మంత్రిగా ఉండి ఏమీ చేయలేని ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తరు?
                                                                                                                                                                                                                                                                        ‑ మంత్రి హరీశ్​రావు

ఇల్లందకుంట/వీణవంక, వెలుగు: ఈటల రాజేందర్​ది ఆత్మగౌరవ పోరాటం కాదని, ఆత్మవంచన అని మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. ఆయనకు ఓటువేస్తే ప్రజలకు ఏం చేస్తారో సూటిగా చెప్పాలని సవాల్​ విసిరారు. ఈటలను గెలిపిస్తే ప్రజలంతా ఓడిపోయినట్లేనని, ఆయనను గెలిపిస్తారో, తామే గెలుస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ‘‘తన రక్తంలో లెఫ్టిజం ఉందని చెప్పే ఈటల రాజేందర్.. రైటిస్ట్ పార్టీ అయిన బీజేపీలో చేరారు. ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితరు. మంత్రిగా ఉండగా చేయలేని పనులను రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎలా చేస్తారో చెప్పాలె. రాబోయే రెండున్నరేళ్లు టీఆర్ఎస్​ గవర్నమెంటే ఉంటుంది. ఆయనకు ఓటు వేసినా లాభం లేదు” అని అన్నారు. బుధవారం హుజూరాబాద్​ నియోజకవర్గం ఇల్లందకుంట, వీణవంక మండల కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభల్లో హరీశ్ మాట్లాడారు. 

‘నువ్వు ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసినవ్​.. నువ్వు కేవలం నీ స్వార్థం కోసం ఎన్నికలు తెచ్చినవు..  రాజకీయంగా ఎదగడం కోసం తెచ్చినవు.. ప్రజలకోసం కాదు..’ అని ఈటలను ఉద్దేశించి  అన్నారు. ఆయన లాభం కోసం కాకుండా 2లక్షల29వేల మంది ప్రజలకు లాభం జరిగేలా టీఆర్​ఎస్​ను గెలిపించాలన్నారు. ‘ఈటల రాజేందర్​ను పెంచి పెద్ద చేసింది కేసీఆర్.. ఆయనకు రాజకీయ ఓనమాలు నేర్పింది కేసీఆర్.. ఆయనను నాయకుడిగా తీర్చిదిద్దింది కేసీఆర్.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా చేసింది కేసీఆర్.. కానీ తండ్రిలాంటి కేసీఆర్​ను, తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని ఈటల రాజేందర్ గుండెల మీద తన్నిండు.. గులాబీ జెండా నీడలో ఎదిగిన నాయకుడు ఆ పార్టీకే వ్యతిరేకంగా మోసాలు, కుట్రలు చేసిండు.. ’ అని ఆరోపించారు. ఎంపీగా బండి సంజయ్​ రెండేళ్లలో 10 లక్షల పని కూడా చేయలేదని, రేపు రాజేందర్​గెలిస్తే కూడా అంతేనని, అభివృద్ధి జరుగదన్నారు. నిన్నటి దాకా హుజూరాబాద్​లో రాజేందర్​ఏమైనా పనిచేశాడంటే అదంతా కేసీఆర్ దయ వల్లేనని హరీశ్​రావు అన్నారు. బీజేపీలో చేరినంక ఈటల రాజేందర్ కొత్త భాష నేర్చుకుంటున్నాడని, ఇటీవల తనను, సీఎం కేసీఆర్​ను ‘రా’ అని సంబోధిస్తున్నాడని ఆరోపించారు.  హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదని, ఆ పార్టీ అడుగంటి పోయిందన్నారు. ఇక్కడున్నవి బీజేపీ, టీఆర్ఎస్ మాత్రమేనని హరీశ్​రావు చెప్పారు.
హుజూరాబాద్ బాధ్యతలు నావే
‘‘మా ప్రభుత్వం రైతు బంధు, కల్యాణలక్ష్మి, పింఛన్లు.. వంటి ఎన్నో స్కీములు అమలుచేస్తోంది. కానీ ఈటల రాజేందర్.. ఆసరా పింఛన్లను పరిగె అని అంటుండు. రైతుబంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మి వద్దంటుండు” అని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. ప్రతి మంత్రికి 4 వేల చొప్పున డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు. ఆయన దత్తత తీసుకున్న సిరిసేడు గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయారని విమర్శించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గ బాధ్యతలన్నీ తానే చూసుకుంటానని, ఆగిపోయిన 4 వేల ఇండ్లు నిర్మిస్తామని, సొంత జాగ ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామని చెప్పారు. రైతుల రుణ మాఫీ కింద ఇప్పటికే 25 వేల లోపు రుణాలు మాఫీ చేశామని, ఆగస్టు 15 నుంచి 50 వేల లోపు రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పారు.  ఇందుకోసం రెండు వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. వీణవంక మండలంలోని 24 గ్రామాల్లో స్వశక్తి సంఘ భవనాల నిర్మాణానికి 4 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సంబంధిత చెక్కులను స్వశక్తి సంఘాల మహిళలకు హరీశ్ అందజేశారు.
గెల్లు శ్రీనివాస్​ను గెలిపించండి
హుజూరాబాద్​ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ను ఇల్లందకుంట సభలో పరిచయం చేసిన మంత్రి హరీశ్.. ఆయనను గెలిపించాలని కోరారు. ‘‘గెల్లు శ్రీనివాస్.. తెలంగాణ కోసం పోరాడిండు. జైలుకు పోయిండు. 21 ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేసిండు. శ్రీనివాస్​ను గెలిపిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి’’ అని హరీశ్ కోరారు. ఈటల రాజేందర్ పంచిన గడియారాల్లో పువ్వు గుర్తునే పెట్టాడని.. మోడీ, అమిత్ షా బొమ్మలు పెడితే పెరిగిన ధరలు, ఊడిన ఉద్యోగాలు గుర్తుకు వస్తాయనే ఇలా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈటల 5 వేల కుట్టు మెషిన్లు, 5 వేల గ్రైండర్లు, ప్రెషర్ కుక్కర్లు తెప్పించిపెట్టారని, ఆయన ఇచ్చిన వస్తువులు తీసుకోవాలని, కానీ ఆయనకు ఓటేస్తానని ఒట్టు మాత్రం పెట్టుకోవద్దన్నారు. 2 గుంటలున్న పేదోడు గెల్లు శ్రీనివాస్.. 200 ఎకరాల ఆసామి ఈటల రాజేందర్ మధ్య పోటీ జరుగుతోందన్నారు.