భూంపల్లి, అక్బర్ పేట్ మండలాల ఏర్పాటుపై మంత్రి హరీష్ రావు హర్షం

భూంపల్లి, అక్బర్ పేట్ మండలాల ఏర్పాటుపై మంత్రి హరీష్ రావు హర్షం

భూంపల్లి, అక్బర్ పేట్ కొత్త మండలాలుగా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కుక్కనూర్ పల్లి, నిజాంపేట్, భూంపల్లిలను కొత్త మండలంగా కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని అడగగానే అనుమతి ఇచ్చారని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. బీజేపీ నేతలు, ప్రధానమంత్రి మోడీ ఫొటో లేదని గొడవ చేస్తున్నారపని అన్నారు. వాళ్లకు చెప్పేదేంటంటే.. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచినందుకు చేనేత వస్త్రాలపైన జీఎస్టీ వేసినందుకు బొమ్మలు వేసుకోండి అని హేళన చేశారు. బోరుబావి వద్ద మీటర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టనని చెప్పినందుకు రూ. 6వేల కోట్ల రూపాయలు ఎందుకు నిధులు ఆపేశారో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉచిత విద్యుత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నందుకు కేంద్రం ఓర్వలేకపోతుందని, అందుకే నిధులు ఆపేసిందని ఆరోపించారు. కాళేశ్వరం నుండి ఒక ఎకరం భూమికి కూడా నీరు పారలేదని చెప్తున్న నేతలు... ఇప్పుడు భూంపల్లి వాగులో ఇక్కడ పూలు జల్లుతున్నారని, అక్కడకి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తగా కట్టారని అంటున్నారని, అలాంటి వాళ్ళను వాగులో పడేద్దామని వ్యాఖ్యానించారు. వడ్లు కొనమని కేంద్రం చెప్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కొని రైతులకు అండగా నిలిచారని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశారు.

గొప్పలు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు

అబద్దాల యూనివర్సిటీ ఉంటే దానికి ఛాన్సలర్ గా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉండేవారని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ప్రతి పనిని తానే మంజూరు చేశానని రఘునందన్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. టీవీలో గొప్పలు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు.