'బలగం’ మొగిలయ్య అనారోగ్యంపై స్పందించిన హరీష్ రావు

'బలగం’ మొగిలయ్య అనారోగ్యంపై స్పందించిన హరీష్ రావు

'బలగం' సినిమాలో నటించి, అందర్నీ కంటతడి పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. వీ6, వెలుగు వార్తా ఛానెల్ లో ప్రసారమైన కథనంపై స్పందించిన మంత్రి... పుట్టెడు కష్టాలతో, అనారోగ్య సమస్యలతో సతమవుతున్న మొగిలయ్యకు కావాల్సిన మందులు అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డయాలసిస్ సేవలు అందేలా ఏర్పాటు చేయాలని సూచించారు.   

కరోనా టైంలో మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి.  దీంతో ఆయన రోజు తప్పించి రోజు డయాలసిస్ కోసం దవాఖాన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల మొగిలయ్యను మరో హెల్త్​ ప్రాబ్లమ్​ చుట్టుముట్టింది. బీపీ, షుగర్‍ పెరగడంతో.. ఆయన రెండు కండ్లపై ఎఫెక్ట్ పడింది.  ఎప్పట్నుంచో బీపీ, షుగర్‍ తో  బాధపడుతున్న ఆయనకు .. ఇప్పుడు ఆ ప్రభావం మిగతా అవయవాలపైనా పడింది. 'బలగం' సినిమా చేస్తున్న సమయంలోనూ ఓ సారి ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. హాస్పిటల్​ కు తీసుకెళ్లి చెక్​ చేయిస్తే.. కిడ్నీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. టెస్టులు చేయిస్తే.. రెండు కిడ్నీలు ఫెయిలైనట్టు రిపోర్ట్​ వచ్చింది.  ఇంతకుముందు కరోనా సోకడం వల్లే మొగిలయ్య కిడ్నీలు దెబ్బతిన్నాయని డాక్టర్లు అన్నారు. ఇక డయాలసిస్ చేయించడం  కంపల్సరీ అని చెప్పారు. దీంతో అప్పటినుంచి వారానికి మూడు రోజులు హాస్పిటల్​ కు వెళ్లి డయాలసిస్​ చేయించుకుంటున్నారు.

వరంగల్​ సిటీకి  వచ్చిపోవడానికి తోడూ మందులకు ప్రతినెలా రూ. 20 వేల దాకా ఖర్చు అవుతున్నది.  ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చు చేశామని మొగిలయ్య  భార్య కొమురమ్మ  ఏడుస్తూ చెప్పారు. నమ్ముకున్న కళ ద్వారా సంపాదించుకున్న రూ.8 లక్షలు ఇప్పటివరకు ఖర్చు చేశామని,  మరో రూ.6 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ మధ్య కాలంలో డయాలసిస్‍ చేయడానికి కూడా మొగిలయ్య శరీరం సహకరించడం లేదని డాక్టర్లు అంటున్నారు. మెరుగైన ట్రీట్‍మెంట్‍ కోసం రూ.3 లక్షలు అవసరమని చెప్తున్నారు.

 కండ్లు మళ్లీ కనపడాలంటే మొగిలయ్యకు రెండుసార్లు ఆపరేషన్‍ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇందుకు కావాల్సిన దాదాపు రూ.2 లక్షలు కూడా ప్రస్తుతం మొగిలయ్య దగ్గర లేవు.  బలగం డైరెక్టర్‍ వేణు కొంత సాయం చేసినా..  అన్ని రకాల ట్రీట్‍మెంట్‍, మందుల కోసం దాదాపు రూ.8 లక్షలు అవసరమవుతాయని  కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మనసున్న మారాజులు తమను ఆదుకోవాలని ఈ దంపతులు కోరుతున్నారు.