సిద్ధిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా

సిద్ధిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా

సిద్దిపేట జిల్లా: సిద్ధిపేటకు దిష్టి తీయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సిద్ధిపేట అభివృద్ధిపైనే మాట్లాడుతున్నారని మంత్రి చెప్పారు. హరీశ్ రావు సిద్ధిపేటనే బాగా అభివృద్ధి చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనను విమర్శిస్తున్నారని, అయితే అవేమీ తాను పట్టించుకోనని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని, కానీ స్థానిక ఎమ్మెల్యేగా సిద్ధిపేటను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పేదల కోసం సిద్దిపేటలో  900 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలిపారు. 

కరోనా వల్ల రెండేళ్లు ఆర్ధికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న మంత్రి... త్వరలోనే డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకు పెద్దగా రుణాలు ఇచ్చింది లేదని, కానీ తమ హయాంలో వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లతో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. అలాగే చెత్త నుంచి ఎరువుల తయారు చేసి గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పాటు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.