
- ఈటలకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు?
కమలాపూర్/హుజూరాబాద్, వెలుగు: ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ ఏం తక్కువ చేశారని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రి పదవులు కట్టబెట్టి పెద్ద చేసి గౌరవం పెంచితే ఇవాళ సీఎంకు గోరి కడుతా అంటున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ మానవతావాది అని,పేదల పక్షపాతి అని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా ఆదివారం కమలాపూర్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన ధూం ధాం కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదంటావా..? సంక్షేమ పథకాలు పొందుతున్న ఆడబిడ్డలు, అక్కా చెల్లెండ్లు, రైతులను అడిగితే ఎవరికి మానవత్వం ఉందో తెలుస్తుంది” అని ఈటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ధరల పెరుగుదల తప్ప చేసింది ఏమి లేదని దుయ్యబట్టారు. కమలాపూర్ ఎప్పటి నుంచో టీఆర్ఎస్కు కంచుకోట అని, అవకాశం ఇస్తే గెల్లు శ్రీను కమలాపూర్‌ను పట్టణంగా తీర్చిదిద్దుతారని ఆయన చెప్పారు.
మోకాళ్ల మీద నడిచినా బీజేపీ గెలవదు
బీజేపీ వాళ్లు మోకాళ్ల మీద నడిచినా ఆ పార్టీ హుజూరాబాద్‌లో గెలువదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చేనేత కార్మికులు ఓటెందుకు వేయాలో చెప్పాలని, ఏడేండ్లలో చేనేత కార్మికులకు బీజేపీ సర్కారు ఒక్క పథకం కూడా తీసుకురాలేదని విమర్శించారు. తాము చేనేత కార్మికులు నేసిన ప్రతి వస్త్రాన్ని కొని భద్రతను ఇస్తున్నామన్నారు. ‘‘మీరు మీటింగులు పెట్టి టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం కాదు.. మీరు ఏం చేశారో చెప్పండి” అని బీజేపీ నేతలపై మండిపడ్డారు.
కోడ్ ఉల్లంఘన
టీఆర్ఎస్ పార్టీ కోడ్‌ను ఉల్లంఘించింది. ఆదివారం కమలాపూర్‌లో నిర్వహించిన ధూం ధాం సభను బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. సభకు 7 గంటల వరకే పర్మిషన్ ఉండగా.. ఏడు దాటినా కొనసాగించారు. సభకు వెయ్యి మందికిలోపే పర్మిషన్ ఉండగా.. సుమారు 5 వేల మందితో నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో సభ ఏర్పాటు చేయడంతో హన్మకొండకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
దళిత బంధు ఏమైందని నిలదీసిన ప్రజలు
దళిత బంధు పథకంలో భాగంగా రూ. 10 లక్షలు ఇస్తానని ఇవ్వడం లేదు కానీ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ధూం ధాం సభకు వచ్చిన భాగ్య అనే మహిళ మండిపడ్డారు. ‘‘సెల్లుల పైసలు పడ్డట్టు మెసేజ్ వచ్చింది. కానీ చేతికి రాలేదు. నాకు ఇల్లు కాలిపోయినా పైసలు రాలేదు. దళిత బంధు పైసలు అందలేదు” అని అన్నారు. దళిత బంధుపై లీడర్లను కచ్చితంగా అడుగుతామని అక్కడకు వచ్చిన భాగ్యతో పాటు పలువురు మహిళలు చెప్పగా.. లోకల్ లీడర్లు నిలువరించే ప్రయత్నం చేశారు.