హ్యాట్రిక్​ గ్యారంటీ.. సెంచరీ కొడ్తం : మంత్రి హరీశ్

హ్యాట్రిక్​ గ్యారంటీ.. సెంచరీ కొడ్తం : మంత్రి హరీశ్
  • హ్యాట్రిక్​ గ్యారంటీ.. సెంచరీ కొడ్తం
  • కోటి కుటుంబాలకు కేసీఆర్ ​బీమా
  • బడ్జెట్​ పరిమితులకు లోబడే హామీలిచ్చాం
  • రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ బలహీనంగా ఉన్నయ్
  • ‘‘వీ6 వెలుగు’’తో మంత్రి హరీశ్

హైదరాబాద్, వెలుగు :  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​హ్యాట్రిక్​గ్యారంటీ అని, వందకు పైగా సీట్లతో సెంచరీ కొడుతామని మంత్రి హరీశ్​రావు అన్నారు. సోమవారం ‘‘వీ6 వెలుగు’’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్​అంటే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం.. విశ్వాసమని అన్నారు. రానే రాదన్న తెలంగాణను కేసీఆర్​సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పి14 ఏళ్లు పోరాడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు.

కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను కాంగ్రెస్​కాపీ కొట్టి గ్యారంటీలుగా ఇచ్చింది తప్ప తాము ఎవరినీ కాపీ కొట్టలేదన్నారు. అందుకే పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్​రూ.2 లక్షల రుణమాఫీ అని హామీ ఇచ్చినా కేసీఆర్​రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్తే ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఎన్నికల​మేనిఫెస్టోలో పెట్టకపోయినా..ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. కేసీఆర్ అద్భుతమైన మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టారని తెలిపారు.

దేశంలో కేసీఆర్​ఇస్తున్నంత పెన్షన్​దేశంలో బీజేపీ, కాంగ్రెస్​పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్​ప్రవేశ పెట్టిన రైతుబంధును కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. రెండోసారి గెలవడం కోసమే కేసీఆర్​రైతుబంధు తెచ్చారు.. గెలిచినంక ఉండదని విమర్శలు చేశారని వరుసగా11 విడతలు రైతుబంధు ఇచ్చామన్నారు. 

400 రూపాయలకే సిలిండర్​

రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా ఇవ్వబోతున్నామని హరీశ్​రావు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్​సిలిండర్​బిల్లు చూస్తేనే కళ్లల్లో నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేదని, అందుకే రూ.400 కే గ్యాస్​సిలిండర్​ఇస్తామని చెప్పామన్నారు. సౌభాగ్యలక్ష్మీ స్కీం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేలు ఇస్తామని, రేషన్​కార్డులున్న వారికి సన్నబియ్యం సరఫరా చేస్తామన్నారు. బీఆర్ఎస్​మేనిఫెస్టో మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆసరా పింఛన్​దారులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.

బోరు బావులకు మీటర్లు పెట్టలేదని కేంద్రం రూ.30 వేల కోట్లు కోత పెట్టిందన్నారు. బీఆర్జీఎఫ్​నిధులు కూడా పెండింగ్​లో పెట్టిందన్నారు. ఇప్పటి వరకు రూ.72,972 కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రూ.6,488  కోట్లు రైతుబీమా కోసం వెచ్చించామని, 30,391 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రైతుల మీద తొమ్మిదిన్నరేళ్లలో రూ.1,85,972 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేసీఆర్​కు.. ఆసరా పింఛన్​ లబ్ధిదారులు 43.68 లక్షల మంది, రైతుబంధు అందుతున్న కుటుంబాలు 69 లక్షలు అండగా ఉన్నాయని, ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్​కే పడుతాయని తమ స్కీములను కాంగ్రెస్​నకల్​కొట్టిందన్నారు.

‘‘కాంగ్రెస్​హామీలను మేం కాపీ కొట్టలేదు.. రైతుబంధు సృష్టికర్తే కేసీఆర్.. కాంగ్రెస్​పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భిక్షం వేసినట్టుగా ఇచ్చేవాళ్లు.. పెన్షన్​పదింతలు పెంచి రూ.2,016 ఇస్తున్నాం.. దీన్నివాళ్లు కాపీ కొట్టారు. కాంగ్రెస్​కు 11 సార్లు అధికారం ఇచ్చినా వాళ్లు చేయని పనులను పదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారు” అని అన్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజ్​నాథ్​సింగ్​ఇక్కడికి వచ్చి తెలంగాణలో అభివృద్ధే జరగలేదని అంటున్నారని, తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని , ఫ్లోరైడ్​రహిత రాష్ట్రమని కేంద్ర మంత్రులు పార్లమెంట్​లో చెప్పలేదా అని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో కేంద్రం తెలంగాణకు నష్టం చేసిందని, విభజన చట్టంలోని ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.

సంపద పెంచి.. పేదలకు పంచుతూ..

సంపద పెంచి పేదలకు పంచాలన్నది తమ విధానమని మంత్రి హరీశ్​రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్డీపీని రూ.4.48 లక్షల కోట్లు ఉంటే దాన్ని రూ.13.27 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి 3.17 లక్షలకు పెంచామన్నారు. ఏటా 10 నుంచి14 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తామని.. దానికి అనుగుణంగానే దశల వారీగా హామీలను నెరవేర్చబోతున్నామని తెలిపారు. ‘బడ్జెట్​ పరిమితులకు లోబడే హామీలు ఇచ్చాం.. కేసీఆర్ మాట చెప్పారంటే నెరవేరుస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఉంది’ అని అన్నారు.

కళ్యాణలక్ష్మి స్కీంతో బాల్య వివాహాలు ఆగిపోయాయని తెలిపారు. ఆసరా పింఛన్​తో కుటుంబాల్లో వృద్ధులకు గౌరవం పెరిగిందని తమతో ఎంతో మంది చెప్పారన్నారు. విద్య, వైద్యంపై తమ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందన్నారు. 2‌‌‌‌014 నుంచి 2018 మధ్య తమ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. 95 శాతం స్థానిక యువతకే ఇచ్చేలా ప్రెసిడెన్షియల్​ఆర్డర్​తెచ్చామని, 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​లు ఇచ్చామన్నారు. ఏటా ఏర్పడే ఖాళీలను అదే ఏడు భర్తీ చేసేలా జాబ్​క్యాలెండర్​తీసుకువస్తామన్నారు. 

ధరణి రద్దు చేస్తామనడం అర్థరహితం

సీటు కోసం మతకల్లోలాలు సృష్టించిన చరిత్ర కాంగ్రెస్​పార్టీదని మంత్రి హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్​లో డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని గుర్తు చేశారు. ధరణిలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని చెప్పాలే కానీ కాంగ్రెస్​పార్టీ మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తామనడం అర్థరహితమన్నారు. ధరణితో భూ వ్యవహారాలన్నీ పారదర్శకంగా మారాయన్నారు. కాంగ్రెస్​కు లీడర్లు లేరు.. బీజేపీకి క్యాడర్​లేదన్నారు.

కాంగ్రెస్​కు 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేక పక్క పార్టీల వైపునకు చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నాయన్నారు. తమ పార్టీ అభ్యర్థులు రెండు నెలలుగా ప్రచారంలో ఉంటే అభ్యర్థులను తేల్చలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయన్నారు. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్​తో, మరికొన్ని జిల్లాల్లో బీజేపీతో తమకు పోటీ ఉందన్నారు. ఆ రెండు పార్టీల ఆరాటం రెండో స్థానం కోసం మాత్రమేనన్నారు. అధికారంలోకి వస్తామని వాళ్లు చెప్పడం మేకపోతు గాంభీర్యమే అని హరీశ్​రావు స్పష్టం చేశారు.