బీజేపీకి ఓటేస్తే ఉద్యోగాలు ఔట్ : హరీశ్​ రావు

బీజేపీకి ఓటేస్తే ఉద్యోగాలు ఔట్ : హరీశ్​ రావు

మెదక్, వెలుగు: విద్యుత్​ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉద్యోగుల జాబ్ లు ఊడిపోతాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్​ రావు అన్నారు.​ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మెదక్ లో నిర్వహించిన విద్యుత్  ప్రగతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యుత్​ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం ఒక్కొక్కటిగా డిస్ట్రిబ్యూషన్, జనరేషన్​ విభాగాలను ప్రైవేటీకరించాలని చూస్తున్నదన్నారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన కూడా అందులో భాగమే అని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచన అమలైతే విద్యుత్​ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ‘‘విద్యుత్  కంపెనీలను అమ్మి ఉద్యోగులను తొలగిస్తే రాష్ట్రానికి ఐదేళ్లలో రూ.30 వేల కోట్లు ఇస్తామని చెప్పినా కేసీఆర్​ అందుకు ఒప్పుకోలేదు. విద్యుత్  ఉద్యోగులు ఎట్టి పరిస్థితిల్లోనూ బీజేపీని నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్​ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినం. నిరంతరం 24 గంటలు త్రీఫేజ్​ కరెంట్​ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.  బీజేపీ, కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 7 గంటలకంటే ఎక్కువ కరెంటు ఇవ్వడం లేదు. ఇక కాంగ్రెస్  ప్రభుత్వం ఉచిత విద్యుత్  ఇస్తామని ఉత్త కరెంట్ ఇచ్చిందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారం ఇస్తే మళ్లీ ఏడు గంటల కరెంటే  వస్తదన్నారు. విద్యుత్  రంగాన్ని బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం రూ.39 వేల కోట్లు ఖర్చు పెడుతున్నదని మంత్రి చెప్పారు. అనంతరం డీసీసీబీ కొత్త బిల్డింగ్​ను మంత్రి ప్రారంభించారు. జిల్లా మహిళా సమాఖ్య బిల్డింగ్​కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా రెడ్డి, కలెక్టర్​ రాజర్షి షా తదితరులు పాల్గొన్నారు.