ఒకప్పుడు.. ఇప్పుడు జర్నలిజంలో చాలా తేడా ఉంది : హరీష్ రావు

ఒకప్పుడు.. ఇప్పుడు జర్నలిజంలో చాలా తేడా ఉంది : హరీష్ రావు

ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదన్నారు మంత్రి హరీష్ రావు. ‘‘ఒకప్పుడు జర్నలిజం.. ఇప్పటి జర్నలిజం వేరు.. చాలా మారింది. పోటీ ప్రపంచంలో దళిత జర్నలిస్టులు నిలదొక్కుకోవడానికి IDJN పని చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఈ రోజు ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా అవుతున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. అంబేడ్కర్ చెప్పిన సూచనలను కొంతమంది మాత్రమే పాటిస్తున్నారని చెప్పారు. సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ’ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్టు నెట్ వర్క్’ లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఆడ పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు మహిళా కళాశాలలు నిర్వహించి.. బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు. మొదట దళితులను ఉద్దేశించి మాత్రమే కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభించామని, ఆ తర్వాత ఈ పథకాన్ని అందరికీ ఇస్తున్నామని చెప్పారు. దళితబంధు పథకం కూడా అదే తరహాలో ముందు దళితులకు ఇస్తున్నామన్నారు. ఈ దఫాలో అన్ని నియోజకవర్గాల్లో దళిత జర్నలిస్టులకు కూడా దళిత బంధు ఇస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దేశం గర్వపడ్డదని, ఆ ఘనత సీఎం కేసీఆర్ దే అని చెప్పారు. 

‘‘ఈ మధ్య విడుదలైన నీట్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల రిజల్ట్ అద్భుతం. ప్రైవేటు కాలేజీలతో పోటీ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణ తరహా ఎస్సీ, ఎస్టీ, ఎస్డీఎఫ్ ఇతర రాష్ట్రాల్లో కావాలని కొట్లాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ గురుకులాలు లేవు. కొన్ని రాష్ట్రాల్లో దేవాలయాలకు దళితులను రానించే పరిస్థితి లేదు.- ప్రతి లక్ష జనాభాకు  తెలంగాణ 22 MBBS సీట్లతో ప్రథమస్థానంలో ఉంది. దళిత జాతి కోసం పని చేసే విధంగా దళిత జర్నలిస్టులు పని చేయాలి’’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.