పటాన్ చెరులో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ

పటాన్ చెరులో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ

సంగారెడ్డి జిల్లా : మహత్మా గాంధీకి, కొండా లక్ష్మణ్ బాపూజీకి దగ్గర పోలికలు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ‘విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు’ అంటూ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. స్వాతంత్ర్య సమరంలో ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కొండా లక్ష్మణ్ అని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బస్టాండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. గాంధీజీ జయంతి రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని పటాన్ చెరులో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

అనాడు విస్నూరి రాంచందర్‌రావు దొరకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ భర్త పోరాటం చేస్తే అతన్ని జైలులో పెట్టించారని, ఐలమ్మ భర్త కోసం కొండా లక్ష్మణ్ న్యాయవాదిగా కోర్టుకు వెళ్లి..కొట్లాడి జైలు నుంచి విడిపించారని మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలిన మహొన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తులను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి అమ్మటమే తప్ప, అభివృద్ధి చేయడం తెలియదన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. పద్మశాలి సమాజాన్ని అన్ని విధాలుగా ఆదుకుని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.