సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన పెంచాలి

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన పెంచాలి

రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. వర్షాల కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యల నుంచి ప్రజల్ని కాపాడేందుకు వైద్య సిబ్బంది పూర్తి్స్థాయి సన్నద్దతో ఉండాలని సూచించారు. రోగులకు సత్వర చికిత్స అందించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు సోమవారం అన్ని జిల్లాల వైద్యాధికారులు, సూపరింటెండెంట్లు, వైద్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితి గురించి ఆరా తీశారు. 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని మంత్రి హరీష్ రావు చెప్పారు. మలేరియా, చికెన్ గున్యా, డయేరియా తదితర వ్యాధుల పట్ల జనానికి అవగాహన పెంచాలని, వెనువెంటనే రోగ నిర్థారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు వైద్య సిబ్బంది పంచాయతీ రాజ్ మున్సిపల్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం హరీష్ రావు సూచించారు. 108 వాహ‌నాలు వెళ్ళలేని ప్రాంతాలు ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్నారు.