నాలుగు రోజుల్లో గ్రూప్​4 నోటిఫికేషన్

నాలుగు రోజుల్లో గ్రూప్​4 నోటిఫికేషన్
  • పది రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి

సంగారెడ్డి టౌన్ / సదాశివపేట, వెలుగు : నాలుగు రోజుల్లో 9 వేల గ్రూప్​ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​​ ఇవ్వనున్నట్టు మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. వచ్చే వారం పది రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్ లో ఆసరా పింఛన్లను హరీశ్​రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 వేల కాంట్రాక్ట్​ ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయడంతోపాటు 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారని, ఇప్పటికే 52 వేల ఖాళీల భర్తీకి అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. మిగిలిన గ్రూప్​4, డీఎస్సీ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నించారు. 

కొత్తవి భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలనే పోగొడుతోందని హరీశ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లతో వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, చేనేత, గీత, బీడీ కార్మికులకు అండగా నిలుస్తోందన్నారు. ఏటా రూ.12 వేల కోట్లను పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంటు, ఆసరా పింఛన్లతో సామాన్యులను ఆదుకుంటే.. ఉచిత పథకాలు ఇవ్వొద్దని కేంద్రం కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. అనంతరం సదాశివపేట పట్టణం, మండలం పరిధిలో పలు అభివృద్ధి పనులకు హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్త పెన్షన్​ కార్డులను ఆయన పంపిణీ చేశారు.

భూమి గుంజుకుంటున్నరని.. మంత్రి సభలో ఆత్మహత్యాయత్నం
తాతకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని గుంజుకుంటున్నరని ఓ మనవడు మంత్రి సభలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అప్రమత్తమై అతడిని కాపాడి అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేటలో మంత్రి హరీశ్ రావు బహిరంగ సభలో ఈ ఘటన జరిగింది. సదాశివపేట వడ్డెర కాలనీకి చెందిన వడ్డే శ్రీను తాతకు 1975లో అప్పటి ప్రభుత్వం సదాశివపేట మండలం ఎన్కెపల్లి గ్రామ శివారులో 1.3 ఎకరాల భూమిని ఇచ్చింది. ఎన్కెపల్లి శివారులో 25 ఎకరాల్లో గోడౌన్ల నిర్మాణానికి కేసీఆర్​ సర్కార్​ ప్లాన్ చేసింది. వడ్డే శ్రీను కుటుంబానికి చెందిన ఎకరా మూడు గుంటల భూమిని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. సదాశివపేటకు హరీశ్ వస్తున్నారని తెలుసుకుని ఆయనను కలిసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మనస్తాపానికి గురైన శ్రీను సభ ముగించుకుని మంత్రి వెళ్తుండగా.. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.