పోలవరంపై ఎంక్వైరీ చెయ్యండి.. కేంద్ర మంత్రి షెకావత్​కు మంత్రి హరీశ్ ఫిర్యాదు

పోలవరంపై ఎంక్వైరీ  చెయ్యండి.. కేంద్ర మంత్రి షెకావత్​కు మంత్రి హరీశ్ ఫిర్యాదు
  • డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లను తోడేలా కాల్వలు తవ్వుతున్నరు 
  • ‘పాలమూరు- - రంగారెడ్డి’కి పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి
  • కృష్ణా జలాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలని వినతి
  • జీఎస్టీ బకాయిలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతోనూ భేటీ

ఢిల్లీ, వెలుగు:  డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని వాడుకునేలా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే  పోలవరం కుడి, ఎడమ కాల్వలను వాస్తవ అనుమతుల కన్నా మూడు, నాలుగు వంతులు ఎక్కువగా తవ్వుతోందని ఆరోపించారు. దీనివల్ల గోదావరి జలాల్లో తెలంగాణ హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశంపై పూర్తి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. 50వ జీఎస్టీ కౌన్సిల్ లో హాజరయ్యేందుకు మంగళవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్ రావు.. కేంద్ర మంత్రి షెకావత్ ను ఆయన నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి జలాలు, పలు ప్రాజెక్టులకు సంబంధించి 4 అంశాలపై కేంద్ర మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో హరీశ్ మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు చెప్పారు. కృష్ణా వాటర్ పంపిణీ విషయంపై వెంటనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదికి మాత్రమే కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని చెప్పారని, కానీ ఏటా దీనినే కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ పద్ధతిని నిలిపేసి రెండు తెలుగు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో నీటిని పంచాలని కోరామన్నారు. ఒకవేళ ట్రిబ్యునల్ ను త్వరగా ఏర్పాటు చేస్తే, దాని తీర్పు ప్రకారం కేటాయింపులు జరపాలన్నారు.  

పాలమూరు–రంగారెడ్డికి పర్మిషనివ్వండి 

పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు అనుమతివ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు హరీశ్ రావు తెలిపారు. ఈ లిఫ్ట్ స్కీంలో 90 టీఎంసీల నికర జలాలపై చాలా రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కి డీపీఆర్ ను సమర్పించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు అప్పర్ కృష్ణా పరిధిలో ఉన్న తెలంగాణకు 45 టీఎంసీల వాటర్ వాడుకునే వెలుసుబాటు ఉందని గతంలో బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందన్నారు. అలాగే మైనర్ ఇరిగేషన్ లో మరో 45 టీఎంసీల సేవింగ్స్ ఉన్నాయన్నారు. ఈ మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగా రెడ్డి ఎత్తపోతలకు కేటాయిస్తూ, ఈ ప్రాజెక్ట్ ను క్లియర్ చేయాలని మంత్రిని కోరామన్నారు. అలాగే గోదావరిపై సమ్మక్క బ్యారేజ్, సీతారామ ప్రాజెక్ట్, కాళేశ్వరం మూడో టీఎంసీ, ఇతర ప్రాజెక్ట్ లకు సీడబ్ల్యూసీ నుంచి త్వరగా పర్మిషన్లు ఇచ్చేలా చూడాలని కోరామన్నారు. తన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.   

జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్​కు హాజరు 

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్​లో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ నష్టపరిహారం కింద రూ.700 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.120 కోట్లు.. మొత్తం రూ.820 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉందని మీటింగ్​లో లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. ఈ నిధుల్ని వెంటనే రిలీజ్ చేయాలని కోరామన్నారు. ‘‘పీఎంఎల్ఏ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయాలకు వాడుతున్నారని వ్యాపారుల్లో భయం ఉందని ప్రస్తావించాను. దీంతో తమ దగ్గర ఉన్న వ్యాపారుల సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీకి ఇవ్వబోమని కౌన్సిల్ మీటింగ్​లో కేంద్రం స్పష్టం చేసింది” అని హరీశ్ తెలిపారు.

జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తోనూ భేటీ అయినట్లు హరీశ్ రావు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం–2014 ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చే నిధుల్ని వెంటనే రిలీజ్ చేయాలని కోరినట్టు తెలిపారు. మూడేండ్ల నుంచి  రావాల్సిన నిధులపై ఆమెకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని 9 జిల్లాలను కేంద్రం వెనకబడిన జిల్లాలుగా గుర్తించిందని, వీటికి ఏటా రూ.450 కోట్లు ఇస్తామని చట్టంలో పేర్కొందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015 నుంచి 20-21 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి రూ.450 కోట్ల నిధులు అందాయన్నారు. గత మూడేండ్లకు గాను రూ.1,350 కోట్లు రావాల్సి ఉందన్నారు.