పేపర్ల లీకులు కామనే : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

పేపర్ల లీకులు కామనే : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

TSPSC : క్వశ్చన్ పేపర్ లీకులు సర్వ సాధారణం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. SSC నుంచి అన్ని పేపర్లు లీక్ చాలా కామన్ అంటూ మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ల లీకుల విషయంలో ప్రతిపక్ష నాయకులు మంత్రి కేటీఆర్ ను దోషి అనడం కరెక్టు కాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని సిట్ ఆధారాలు అడిగితే తప్పేంటి..? అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. లీకుల విషయంలో ప్రతిపక్ష నాయకులు ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్.. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లీకుల విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుని మాట్లాడుతున్నారంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్స్ లీకుల విషయాన్ని  మంత్రులు చాలా లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. లీకులు కామన్ అయినప్పుడు కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఖర్చు పెట్టి.. రాత్రింబవళ్లు కష్టపడి చదవడం ఎందుకు అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతల ఆరోపణలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

పేపర్ల లీకేజీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లైట్ తీసుకున్నప్పుడు అరెస్ట్ లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తన ఐటీశాఖకు లీకేజీ వ్యవహారంలో ఏం సంబంధం అని ప్రశ్నించారని నిరుద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు మాత్రమే ఉన్నారని కేటీఆర్ అన్నప్పుడు.. ఇప్పుడు జరుగుతున్న సిట్ విచారణ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే లీకులు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు సిట్ కూడా ఆ కోణంలో విచారణ ఎందుకు చేయడం లేదని నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. 

మరోవైపు.. లీకుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఇప్పటి వరకూ ఎన్ని పేపర్లు లీకయ్యాయో...? ఇంకా తెలియడం లేదు. దీనిపై గందరగోళం నెలకొంది. తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న సంకల్పంతో రాత్రింబవళ్లు కష్టపడి చదువుకున్న వాళ్ల శ్రమ ఏంటో తెలియకుండా మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతారా..? అని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇది ప్రభుత్వ విధానామా..? లేక ఇంద్రకరణ్ రెడ్డి పర్సనల్ వెర్షనా...? అని ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణ జరుగుతున్న సమయంలో ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.