
నస్పూర్,వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 17న ఢిల్లీలో చేపట్టనున్న నిరసనను సక్సెస్ చేయాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కోరారు. మంగళవారం ఏరియాలోని ఆర్కే6 గనిపై ఉపాధ్యక్షుడు బరపటి మారుతి ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బొగ్గుపరిశ్రమల్లో ప్రైవేటు పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్నారు. కాట్రాక్ట్, ఔట్సోర్సింగ్కార్మికులకు హైపరవ్వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు పేరం రమేశ్, శ్రీధర్ రెడ్డి, గోపతి సందీప్, పొదిశెట్టి వినోద్ కుమార్, పెండ్లి మోహన్ రెడ్డి, తిరుపతి, రమేశ్, రామకృష్ణ, నాగార్జున, అంకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వివేక్
జైపూర్,వెలుగు: జైపూర్ మండలం పౌనూర్‌లో ఇటీవల అనారోగ్యంతో మృతి చందుపట్ల పద్మ కుటుంబాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. ఆయన వెంట పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, చెన్నూర్ టౌన్ ప్రెసిడెంట్ సుద్దపల్లి సుశీల్‌కుమార్, జైపూర్ మండల అధ్యక్షుడు విశ్వంభర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్ ఉన్నారు. చెన్నూరులో బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ పెండ్యాల శ్రీకాంత్ అత్తమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబసభ్యులను వివేక్ పరామర్శించారు.
రైతుల సంక్షేమానికి కృషి
నర్సాపూర్(జి),వెలుగు: టీఆర్ఎస్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం కృషిచేస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన దిలావర్ పూర్, నర్సాపూర్(జి)లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ధాన్యం అంతా కొనుగోలు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఈసారి 1.15 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారని, సుమారు 23 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై రైతులు దృష్టిపెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్షర అనిల్, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పీఏసీఎస్మండల అధ్యక్షుడు రమణారెడ్డి, మండల కన్వీనర్ పాపెన రాజేశ్వర్, ఎంపీపీ రేఖారమేశ్, సర్పంచ్ గోవింద్ రెడ్డి, గంగారెడ్డి, డీసీఎంఎస్ నిర్వాహకులు రవి తదితరులు పాల్గొన్నారు.
డ్యాన్స్ పోటీల్లో నిర్మల్ స్టూడెంట్ ప్రతిభ
నిర్మల్,వెలుగు: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఆధ్వర్యంలో నిర్వహించిన డ్యాన్స్ పోటీల్లో నిర్మల్ స్టూడెంట్ పడిగెల ప్రియదర్శిని ప్రతిభ కనబరిచారు. పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కు చెందిన పడిగెల శ్రీనివాస్– నవనీత కూతురు ప్రియదర్శిని ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్‌లో రాణిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. రెండు రోజుల క్రితం మలేషియా దేశంలోని కౌలాలంపూర్ బట్టు కేవ్స్ వద్ద జరిగిన పోటీట్లో తన నృత్య ప్రదర్శనతో ఆకట్టుకుంది. పోటీల్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి నలుగురికే ఈ అవకాశం దక్కింది. ప్రతిభ కనబర్చిన ప్రియదర్శినిని తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా బాధ్యులు అవార్డు అందజేసి సత్కరించారు.
ముగిసిన విఠలేశ్వరుని జాతర..ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
భైంసా,వెలుగు: వారం రోజులుగా కొనసాగుతున్న తానూర్ విఠలేశ్వరుని కార్తీక ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. జాతరకు చుట్టు పక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎస్సై విక్రం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి మల్లయోధులు పోటీల్లో తలపడ్డారు. విజేతలకు నిర్వాహకులు బహుతులు అందజేశారు.
ఒంటి చేత్తో కుస్తీ...
మహారాష్ట్రలోని ధర్మబాద్ నియోజకవర్గంలోని కర్కెల్లి గ్రామానికి చెందిన గణేశ్ఐదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో కుడి చేయి కోల్పోయాడు. అయినా ఒంటిచేత్తో కుస్తీ పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. కార్యక్రమంలో సర్పంచ్ విఠల్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు మాధవ్ రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
హాస్పిటళ్లలో వసతులు కల్పించాలి
ఆసిఫాబాద్,వెలుగు: ఆసిఫాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించాలని రీజినల్ ఇన్స్టిట్యూట్ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ విశ్వనాథప్ప సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌ను ఆయన విజిట్ చేశారు. డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. కౌటాల, సిర్పూర్, తిర్యాణి ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. తిర్యాణి మండలంలో కొన్ని గ్రామాల్లో సెల్ టవర్లు లేని కారణంగా స్థానికులు కనీసం 108కు ఫోన్ చేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ జీతం ఇస్తామన్నా.. పనిచేయడానికి డాక్టర్లు ఎవరూ రావడంలేదన్నారు. సమస్యలను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఇషాశర్మ,మహిపాల్, సభ్యులు రాజేశ్ రంజన్, కపిల్ జోషి, సంపన్, ఎక్తా, డబ్ల్యూహెచ్‌వో అధికారిణి సోని, ఫైనాన్స్ పరిశీలకుడు హరికృష్ణ, రాష్ట్ర ఎన్సీడీ కోఆర్డినేటర్ జగన్నాథరెడ్డి, అడిషనల్ డైరెక్టర్ పుష్ప, అర్చన, డీఎంహెచ్‌వో ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ వైద్యాధికారి సుధాకర్ నాయక్, సూపరిండెంట్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతే సర్కార్ ధ్యేయం
జన్నారం,వెలుగు: పేదల అభ్యున్నతే టీఆర్ఎస్ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ఎమ్మెల్యే రేఖానాయక్ చెప్పారు. మంగళవారం మండలంలో ని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. అనంతరం ఇందన్ పెల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతి కృషిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుతారి వినయ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేశ్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్ సిటిమల భరత్ కుమార్, మొర్రిగూడ సర్పంచ్ గోపాల్, ఇందన్ పెల్లి ఎంపీటీసీ శ్రీవాణి, కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సులువ జనర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీవారి రథోత్సవం
ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం వేకువజామున రథోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు చక్రపాణి వాసుదేవాచారి, స్థానాచారులు నర్సిహమూర్తి, అర్చకులు సందీప్ శర్మ ఆధ్వర్యంలో యాగం, పూర్ణాహుతి తదితర పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సీఐ గూర్ల అజయ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్చైర్మన్అంకం రాజేందర్, కౌన్సిలర్లు కిశోర్ నాయక్, పరిమి సురేశ్, కుర్మా శ్రీనివాస్, కావాలి సంతు, ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజన్న, ప్రధాన కార్యదర్శి రమేశ్, సభ్యులు ఆంజయ్య, శ్రీనివాస్, భీమన్న, లక్ష్మణ్, వాసవీ క్లబ్ జోనల్ చైర్మన్ మహాజన్ జితేందర్, లీడర్లు సత్యం, రాచమల్ల రాజశేఖర్ పాల్గొన్నారు.
ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలి
మంచిర్యాల, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 12న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు కోరారు. పార్టీ జిల్లా ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. మూతబడ్డ ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి 2014 లోనే నరేంద్రమోదీ ప్రభుత్వం 6 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీంతో తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు తీరుతాయన్నారు. యూరియాపై రూ.3వేల సబ్సిడీని అందిస్తూ రైతులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, అందుగుల శ్రీనివాస్, రజినీశ్ జైన్, వెంకటేశ్వర్రావు, వెంకటరమణారావు, శ్రీదేవి, ప్రభాకర్, రమేష్ పాల్గొన్నారు.
పట్టణ సమస్యలపై పోరాటం చేస్తాం
నిర్మల్,వెలుగు: నిర్మల్ పట్టణంలోని ప్రధాన సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ సాదం అర్వింద్ తెలిపారు. మంగళవారం స్థానిక పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ పాలన గాడితప్పిందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ స్తంభాల ఏర్పాటు కోసం ఆఫీసర్లను పలుమార్లు విన్నవించినా స్పందన లేదన్నారు. మున్సిపాలిటీ అవినీతి అక్రమాలపై వరుస ఆందోళనలు చేపడుతామన్నారు. యువత బీజేపీ వైపే ఉన్నారన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ లీడర్లు రావుల రాంనాథ్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మ రాజు, అలివేలు మంగ, కమల్ నాయక్, గాదె విలాస్, శ్రావణ్ రెడ్డి, అల్లం భాస్కర్, రామోజీ నరేశ్, కౌన్సిలర్ సైన్ల శ్రీధర్, మాజీ కౌన్సిలర్ గణేశ్, భూపతిరెడ్డి, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.