కాంగ్రెస్, బీజేపీలది ఓట్ల రాజకీయం: మంత్రి జగదీష్ రెడ్డి

కాంగ్రెస్, బీజేపీలది ఓట్ల రాజకీయం: మంత్రి జగదీష్ రెడ్డి

కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల రాజకీయం కోసమే పోటీ ఉత్సవాలు చేస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న పోటీ ఉత్సవాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జూన్ 1వ తేదీ గురువారం సూర్యాపేట జిల్లాలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొంగ, దొంగ జపాలను తెలంగాణ ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తొమ్మిదేళ్ళ పాలనలో తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి చాటేందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నామని తెలిపారు. ఆరు దశబ్దాలుగా తెలంగాణను చీకట్లోకి నెట్టిన కాంగ్రెస్, తెలంగాణ అభివృద్ధిని నిరోధించే బీజేపీ పార్టీలు ఏమని పోటీ ఉత్సవాలు చేస్తాయని ప్రశ్నించారు.

కేవలం ఓట్లు, అధికారమే పరమావధిగా రెండు పార్టీల తీరు కనిపిస్తుందని జగదీష్ రెడ్డి విమర్శించారు. దేశ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్ ఫెయిల్యూర్ పార్టీ.. వారు ఫెయిల్యూర్ సభలే చేసుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి తెలంగాణపై మాట్లడితే ప్రజలు నవ్వుకుంటారని వెల్లడించారు. వచ్చిన తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకుంటే రాజీనామాకు భయపడ్డ వారు.. తెలంగాణ గురించి ఏం మాట్లాడుతారని నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన మోడీ ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనం చేశాడని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.