ఒక వ్యక్తి స్వార్ధం , ఒక పార్టీ కుట్రతో ఉపఎన్నిక: జగదీష్ రెడ్డి

ఒక వ్యక్తి స్వార్ధం , ఒక పార్టీ కుట్రతో ఉపఎన్నిక: జగదీష్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక పరిణామాలు, ఫామ్ హౌస్ వ్యవహారంలో బీజేపీ వైఖరిపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్ వ్యవహారంలో దొరికిన దొంగల బండారం ప్రజలు ముందు ఉంచామని చెప్పారు. దొరికిన దొంగలను తప్పించేందుకు.. బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దొరికిన వాళ్లు నకిలీ ముఠా అయితే.. ఒరిజినల్ దొంగలు ఎవరో బండి సంజయ్ చెప్పాలని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారని బీజేపీ పై దుయ్యబట్టారు. దొరికిన వాళ్లు ఒరిజినల్ కానప్పుడు నందకుమార్ భార్య.. కేసు ఎందుకు వేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఒక వ్యక్తి స్వార్ధం, ఒక పార్టీ కుట్రతో ఉపఎన్నిక వచ్చిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల తీర్పు న్యాయం వైపే ఉంటుందని చెప్పారు. మూడు నెలలుగా కష్టపడి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉప ఎన్నిక వచ్చిందన్న ఆయన.. రేపటి విజయం తెలంగాణ అభివృద్ధికి పునాది అవుతుందని చెప్పారు. కేంద్రప్రభుత్వం చేయలేని అభివృద్ధిని.. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా.. ఐటీ, ఈడీ, వంటి రాజ్యాంగ సంస్థలను ఉపయోగించినా మునుగోడు ప్రజల స్ఫూర్తిని ఆపలేకపోయిందన్నారు.