గుజరాత్ ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యమే : జగదీశ్ రెడ్డి

గుజరాత్ ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యమే : జగదీశ్ రెడ్డి

ఆంధ్ర, తెలంగాణ మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ ఆలోచన అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విభజన చట్టం అసంబద్ధమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఆకస్మికంగా వచ్చింది కాదని..ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిందన్నారు. ఆంధ్ర, తెలంగాణ మళ్ళీ కలవడం అనేది అసంభవమని తెలిపారు. అలాంటి అవకాశం ఉంటే మద్రాస్ లో మళ్ళీ ఆంధ్రను కలపమని అడగొచ్చన్నారు.

గుజరాత్ ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. దిక్కు లేని పరిస్థితుల్లో గుజరాత్ ప్రజలు బీజేపీకి ఓటు వేశారని  మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి ప్రజలు ఆప్ ని గెలిపించారని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరమని ఈ ఎన్నికలు తెలియజేస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ బీజేపీ కార్యకర్తలా మారాడని ఆరోపించారు. అభివృద్ధి అనే పదం వినడానికి బీజేపీ ఇష్టపడదని విమర్శించారు. బీజేపీ వచ్చిన తర్వాతనే దేశంలో ఆకలి పెరిగిందని మండిపడ్డారు. వ్యాపారులను, నిర్మాణ రంగాలను టార్గెట్ చేసి ఉపాధి అవకాశాలు దెబ్బ తీయాలని  కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.