అన్నిరాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నయ్: జగదీశ్ రెడ్డి

అన్నిరాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నయ్: జగదీశ్ రెడ్డి

తుంగతుర్తి, వెలుగు:- దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణలోని అభివృద్ధి వైపే చూస్తున్నాయని మంత్రి జగదీశ్​​ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కిశోర్​ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గోదావరి జలాలతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల చెరువులను నింపి చివరి భూముల వరకు నీటిని అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, వాటి ఫలాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 316 బూత్​లు ఉన్నాయని, ఒక్కొక్క బూత్​కు 100 మందికి ఒకరి చొప్పున నియమించుకొని కిందిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎస్. రఘునందన్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు తిరుమణి యాదగిరి, మార్కెట్ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీశ్​కుమార్, ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, జడ్పీటీసీ దూపటి అంజలి, పీఏసీఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ బొడ్డు సుజాత,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మధ్యాహ్న భోజనం

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు మంత్రి  జగదీశ్​రెడ్డి సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం,  సాయంత్రం  స్నాక్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నవారికి  మంచి ఆహారం అందించాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు  తెలిపారు. అనంతరం లైబ్రరీ లో అదనపు సీటింగ్ కోసం కావాల్సిన షెడ్ నిర్మాణానికి  గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ వైస్ చైర్మన్ కిశోర్ 
 పాల్గొన్నారు.