చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు

చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు
  • విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ విలీనం పైన కొందరు చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా...  రాచరికానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయని.. అయితే రావి నారాయణరెడ్డి రికార్డును ఎవరో ఇంతవరకు అందుకోలేకపోయారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి 31వ వర్థంతి సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు విడిపోయి ఉండకపోతే దేశ పరిస్థితులు ఈ విధంగా ఉండేవి కాదన్నారు. బీజేపీ ఎనిమిది ఏండ్ల పాలనలో వర్ణ వ్యవస్థను పెంపొందించి ప్రజలను మధ్య యుగంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉన్నత కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాలకు అండగా నిలబడి పోరాడిన యోధుడు రావి నారాయణరెడ్డి అని కొనియాడారు. ఆయన మొదట కుల వ్యవస్థ పైనే పోరాడాడని తెలిపారు.

హైదరాబాద్ సంస్థానాన్ని అంతా ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తెలంగాణ పోరాట యోధుల చరిత్ర వెలుగులోకి రాలేదన్నారు. రావి నారాయణరెడ్డి గారి విగ్రహాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భువనగిరి, నల్లగొండలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి హైదరాబాదు నగరంలో రావి నారాయణ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తానని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.