కడుపుమంటతోనే కాంగ్రెస్​పై ..కేసీఆర్​ ఫ్యామిలీ విమర్శలు

కడుపుమంటతోనే కాంగ్రెస్​పై ..కేసీఆర్​ ఫ్యామిలీ విమర్శలు
  •    పార్లమెంట్​ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ పార్టీ  భూస్థాపితమే
  •     తుక్కుగూడ రాహుల్​గాంధీ​ సభ దేశానికి  దిశానిర్దేశం
  •     మల్లు రవి మెజార్టీ 4 లక్షలు దాటేలా పనిచేయాలని పిలుపు
  •     నాగర్​కర్నూల్ ​పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం 

నాగర్​కర్నూల్, వెలుగు : అధికారం పోయిందన్న కడుపు మంటతోనే కాంగ్రెస్​ సర్కారుపై కేసీఆర్​ ఫ్యామిలీ విమర్శలు చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్​ అయ్యారు. ‘పదేండ్లు  ప్రగతిభవన్​లో పడుకున్న కేసీఆర్, కరువు వచ్చినా.. వరదలు వచ్చినా.. పిడుగులు పడినా  ఏనాడూ బయటకు రాలే. రైతుల గురించి పట్టించుకోలే.. కానీ కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకముందే రైతు పరామర్శల యాత్ర మొదలుపెట్టిండు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయినట్టు కుర్చీ ఊడిపోయిన తర్వాత కేసీఆర్​కు రైతుల కష్టాలు గుర్తుకొస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు.  పార్లమెంట్​ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ​ నామరూపాల్లేకుండా భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు.  

బుధవారం నాగర్ కర్నూల్​ జిల్లా కేంద్రంలో నాగర్​ కర్నూల్​ పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కరువుకు కాంగ్రెస్సే కారణమని కేసీఆర్, కేటీఆర్​, హరీశ్​రావు  పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, వానాకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​కు, కరువుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.  కృష్ణా బేసిన్​ నీటిని రాయలసీమకు కట్టబెట్టి, మన పంటలు ఎండబెట్టిన కేసీఆర్.. ​ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్​రెడ్డి​ ఢిల్లీ పర్యటనలపై కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ‘12 సార్లు కాదు.. 30 సార్లు ఢిల్లీకి పోతాం.. సీఎం ఢిల్లీకి పోతే మీకేం కడుపు నొప్పి?’  అని ప్రశ్నించారు.  

రాబోయే  40 రోజులు కార్యకర్తలు, నేతలంతా కష్టపడితే మల్లు రవి 4 లక్షల మెజార్టీతో గెలవడం ఖాయమని, ఆయన విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో  గెలిపించుకునే బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. ఐదేండ్లపాటు ఎంపీగా ఉండి పార్లమెంట్​ లోపల, బయట నోరు తెరవని రాములుకు బీజేపీలో చేరి  తన కొడుకును గెలిపించాలని అడిగే హక్కు లేదన్నారు. కుల, మతాల మీద రాజకీయాలు చేసే బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.  బీఎస్పీలో ఉండగా కేసీఆర్​ది గడీల పాలన, అవినీతి పాలన అని తిట్టిపోసిన ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్..​ ఇప్పుడు ఎంపీ టికెట్​ కోసం బీఆర్ఎస్​లో చేరి, కేసీఆర్​పాలనను పొగడటం  దురదృష్టకరమన్నారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ జిల్లా​అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్​ వంశీకృష్ణ, నాగర్​ కర్నూల్​, కల్వకుర్తి, వనపర్తి ఎమ్మెల్యేలు రాజేశ్​రెడ్డి, నారాయణరెడ్డి, మేఘారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.