అన్ని పార్లమెంట్​ సీట్లు మనవే : జూపల్లి

అన్ని పార్లమెంట్​ సీట్లు మనవే : జూపల్లి

నాగర్ కర్నూల్,​ వెలుగు: రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లు మనవేనని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా ప్రతీ కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి సైనికుల్లా పోరాడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నాగర్​ కర్నూల్​ నియోజకవర్గ పార్లమెంట్​ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటు విలువైనదేనన్న విషయాన్ని గుర్తించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు. 

సెక్రటేరియెట్​ ముఖం చూడని సీఎంగా కేసీఆర్​ చరిత్ర సృష్టించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ హయాంలో సొమ్మొకడిది సోకొకడిదన్నట్లుగా రాష్ట్ర సంపదను దోచుకున్నారని విమర్శించారు. ప్రజలిచ్చిన అధికారంతో నిరంకుశంగా పెత్తనం చెలాయించిన దుర్మార్గులన్నారు. సకల జనుల పోరాటాలు, ప్రాణ త్యాగాలతో చలించిన సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఒక్క కుటుంబం తమ అవినీతి, అక్రమ సంపాదనతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేశారని విమ ర్శించారు. కాంగ్రెస్​ కార్యకర్తల కష్టార్జితం, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

అవినీతి, పక్షపాతం లేకుండా సామాన్యులకు న్యాయం జరిగేలా రేవంత్​ రెడ్డి సారథ్యంలో పాలన ఉంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నామని, గద్వాల, అలంపూర్​లోనూ పట్టుందన్నారు. నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి ఎంపీగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, ప్రణాళిక సంఘం వైస్​ చైర్మన్​ జి.చిన్నారెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, గద్వాల జడ్పీ చైర్​పర్సన్  సరిత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి పాల్గొన్నారు.