ప్రజలకు డెవలప్​మెంట్​ కనిపించాలి : జూపల్లి కృష్ణారావు

ప్రజలకు డెవలప్​మెంట్​ కనిపించాలి : జూపల్లి కృష్ణారావు
  • నాగర్​కర్నూల్​ జడ్పీ మీటింగ్​లో మంత్రి జూపల్లి కృష్ణారావు
  • ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశం
  • నివేదికలు వినేందుకు సమావేశానికి రాలేదనే విషయం గుర్తించాలని సూచన
  • విద్యుత్  శాఖ పనితీరుపై అసంతృప్తి

నాగర్​కర్నూల్, వెలుగు : జిల్లా పరిషత్​ మీటింగ్​లో అధికారులు నివేదికలు చదువుతుంటే వినేందుకు,  ప్రేక్షకుల్లా కూర్చునేందుకు ఇక్కడికి రాలేదని, కలెక్టర్​ గారు బీ సీరియస్.​. అన్ని శాఖల పూర్తి సమాచారం మీటింగుకు ముందే ప్రజాప్రతినిధులకు అందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఏండ్ల తరబడి పనులు పెండింగ్​లో ఉండడం, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం, అధికారుల వద్ద సమాచారం లేకపోవడం కరెక్ట్​ కాదని, పనితీరుతో ప్రజలకు ఫలితాలు కనిపించేలా పని చేయాలన్నారు.

విద్యుత్, విద్య, తాగునీటిపై పది రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహిస్తానని పేర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్​పర్సన్  శాంతకుమారి అధ్యక్షతన జడ్పీ​సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు డా.వంశీ​కృష్ణ, డా.రాజేశ్ రెడ్డి, కలెక్టర్​ ఉదయ్​కుమార్, అడిషనల్​ కలెక్టర్​ కుమార్ దీపక్, జడ్పీ సీఈవో ఉష, వైస్​ చైర్మన్​ బాలాజీసింగ్​ పాల్గొన్నారు.

విద్యుత్​ శాఖపై సీరియస్..

విద్యుత్​ శాఖపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలను ప్రస్తావించిన మంత్రి జిల్లాలో సబ్​స్టేషన్ల నిర్మాణంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని ఎస్ఈ లీలావతిని ప్రశ్నించారు. స్థలాలు లేకపోవడం, మెటీరియల్​ కొరత కారణమని ఆమె వివరించారు. ఎస్పీడీసీఎల్ ​సబ్​స్టేషన్ల కోసం స్థలాలు కొనలేని పరిస్థితిలో ఉందా అని నిలదీశారు. 2017లో భూమిపూజ చేసిన సబ్​స్టేషన్లు ఇప్పటికి పూర్తి కాకపోతే ఎలాగన్నారు.

వ్యవసాయ కనెక్షన్ల కోసం డీడీలు కట్టిన రైతులకు ఏండ్ల తరబడి మెటీరియల్​ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్​స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్​ఫార్మర్ల స్థాయి పెంపు, లైన్​ షిప్టింగ్, నల్లమల ఫారెస్ట్​లో వటవర్లపల్లి వరకు లైన్​ బలోపేతం, డ్రా చేసిన మెటీరియల్​ ఎవరికి ఇచ్చారనే సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఎస్ఈని ఆదేశించారు.

స్కూళ్లను బలోపేతం చేద్దాం..

విద్యాశాఖపై జరిపిన రివ్యూ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి గ్రామాల్లోని స్కూళ్లను బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులకు వచ్చే నిధులతో పాటు కలెక్టర్  నుంచి కొన్ని ఫండ్స్  తీసుకోవాలని, చందాలు వసూలు చేసుకోవాలన్నారు. గవర్నమెంట్​ స్కూళ్లలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రైవేట్​ టీచర్​ను నియమించుకొని శారీరక వ్యాయామం, విద్య బోధన చేసేలా చూడాలన్నారు. 

బెల్ట్​షాపులను కంట్రోల్​ చేయాలి..

మంత్రి జూపల్లి మీటింగ్​కు రాకముందు అబ్కారీ శాఖపై రివ్యూ జరిగింది. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జడ్పీటీసీలు మాట్లాడుతూ గ్రామాల్లో బెల్టు షాపులు హోం డెలివరీ కేంద్రాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్​ను టాబ్లెట్స్, డ్రాప్స్​గా అమ్ముతున్నారని హైదరాబాద్​కు గిరిజన తండాలకు మధ్య ఉన్న లింక్​ బ్రేక్​ చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో లారీల కొద్ది బెల్లం అమ్మినవారిపై కేసులు పెట్టలేదని, పట్టుబడిన లారీలు, డీసీఎంలను వదిలేశారని జడ్పీటీసీలు ఆరోపించారు.

చెట్టు లేని గ్రామాల్లో కల్లు అమ్ముతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతరం ఇరిగేషన్​ శాఖపై చర్చించారు. కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమి, అవసరమైన భూమి, చెల్లించిన మొత్తం,పెండింగ్​ వివరాలు ఇవ్వాలని జడ్పీ వైస్​ చైర్మన్​ బాలాజీ సింగ్​ కోరారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి వెళ్లిపోగా, ఇతర అంశాలపై చర్చించారు.