కృష్ణా నీళ్లలో ఏపీకి సహకరించింది కేసీఆరే.. : మంత్రి జూపల్లి కృష్ణారావు

కృష్ణా నీళ్లలో ఏపీకి సహకరించింది కేసీఆరే.. : మంత్రి జూపల్లి కృష్ణారావు

కాళేశ్వరం ప్రాజెక్టులో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన కేసీఆర్.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేఆర్ఎంబీ పేరుతో కొత్త డ్రామాలు మొదలుపెట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

నీళ్లు ఎత్తుకుపోయేందుకు ఏపీకి గత బీఆర్ఎస్ సర్కారే సహకరించిందని జూపల్లి మండిపడ్డారు. ‘‘పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను విభజన చట్టంలోని 11వ షెడ్యూల్​లో పెట్టలేదు. వాటిని 11వ షెడ్యూల్​లో పెట్టాలని కేంద్రంపై బీఆర్ఎస్ ఏనాడైనా ఒత్తిడి తెచ్చిందా? ఏపీకి సంబంధించిన గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టులను 11వ షెడ్యూల్​లో చేర్చినా బీఆర్ఎస్​అభ్యంతరం చెప్పలేదు. పైగా ఏపీ కొత్తగా రాయలసీమ లిఫ్ట్​ఇరిగేషన్​పథకాన్ని చేపట్టి నీటిని తరలించుకోవడానికి ప్రయత్నిస్తే, అప్పటి బీఆర్ఎస్​సర్కార్ పూర్తిగా సహకరించింది.

అంతేగాకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు అనుమతి లేదని 2021 జులై 15న గెజిట్​నోటిఫికేషన్​ఇచ్చినా.. అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఆనాడే ప్రాజెక్టులపై కేఆర్ఎంబీకి పూర్తి అధికారాలను కేంద్రం ఇచ్చినా ఎందుకు నోరెత్తలేదు? అధికారంలో ఉన్న పదేండ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడేమో పోరాటం చేస్తామంటున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోరాటమేదో అప్పుడే కేంద్రంపై చేసి ఉంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.