అవినీతి బయటపడ్తదనే కేసీఆర్ డ్రామాలు: జూపల్లి

అవినీతి బయటపడ్తదనే  కేసీఆర్ డ్రామాలు: జూపల్లి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన కేసీఆర్.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేఆర్ఎంబీ పేరుతో కొత్త డ్రామాలు మొదలుపెట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ‘‘కేసీఆర్ అధికారం కోల్పోయిన బాధలో ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నడు. రాజకీయ ప్రయోజనాల కోసం కేఆర్ఎంబీ అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నడు” అని ఫైర్ అయ్యారు. నాటకాలు ఆడడంలో కేసీఆర్​దిట్ట అని.. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ నాటకాలకు తెరదీశారని అన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ సంతకం పెట్టిందే కేసీఆర్ అని, ‘ఉల్టా చోర్​ కొత్వాల్​కో డాంటే’ అన్నట్టుగా ఆయన తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వీర్లపల్లి శంకర్, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు వంశీచంద్​రెడ్డితో కలిసి గాంధీ భవన్​లో మీడియాతో జూపల్లి మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని.. కానీ నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నోరెత్తలేదని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పోరాడాల్సింది పోయి.. కేంద్ర ప్రభుత్వంతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారని ఫైర్ అయ్యారు. కేంద్రం ముందు గత బీఆర్ఎస్ సర్కార్ మోకరిల్లిందని.. రైతు చట్టాలు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి వత్తాసు పలికిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కృష్ణా బేసిన్​పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే 68.5 శాతం ఉంది. ఈ లెక్కన మనకు 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీలు దక్కాలి. కానీ దీనిపై కేసీఆర్​ఎప్పుడూ డిమాండ్​చేయలేదు. తెలంగాణ‌‌కు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలకు ఒప్పందం కుదుర్చుకున్నారు’’ అని ఫైర్​ అయ్యారు. 

మన వాటా నీళ్లనూ వాడుకోలేదు.. 

ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను కూడా కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏనాడూ సరిగ్గా వాడుకోలేదని జూపల్లి మండిపడ్డారు. ‘‘2013–14కు ముందు వరకు నాగార్జునసాగర్​ప్రాజెక్ట్​నుంచి 150 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్​హయాంలో సగటున 85 టీఎంసీలే వాడుకున్నారు. మన వాటా నీళ్లను కూడా సరిగ్గా వాడుకోకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు. మన వాటా పూర్తిగా వాడుకోకుండా, ఆ మిగిలిన నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేలా సహకరించారు. పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా 34 టీఎంసీలనే వాడుకోవాల్సిన ఏపీ.. 100 టీఎంసీలకు పైగా ఇతర బేసిన్లకు తరలించుకుపోతున్నా గత బీఆర్ఎస్ సర్కార్ సప్పుడు చేయలేదు” అని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ వల్ల ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర​అన్యాయం జరిగిందని అన్నారు. ‘‘పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా.. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రూ.లక్ష కోట్లు వెచ్చించారు. ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోయారు. మన నీటిని మనం సద్వినియోగం చేసుకుని ఉంటే.. బ్రజేశ్​కుమార్​ట్రిబ్యునల్​ఎదుట బలంగా వాదనలు వినిపించి ఉండేవాళ్లం” అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్​ ప్రభుత్వం పని చేస్తుందని.. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని, భవిష్యత్తులోనూ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. 

ఏపీకి సహకరించింది బీఆర్ఎస్సే.. 

నీళ్లు ఎత్తుకుపోయేందుకు ఏపీకి గత బీఆర్ఎస్ సర్కారే సహకరించిందని జూపల్లి మండిపడ్డారు. ‘‘పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను విభజన చట్టంలోని 11వ షెడ్యూల్​లో పెట్టలేదు. వాటిని 11వ షెడ్యూల్​లో పెట్టాలని కేంద్రంపై బీఆర్ఎస్ ఏనాడైనా ఒత్తిడి తెచ్చిందా? ఏపీకి సంబంధించిన గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టులను 11వ షెడ్యూల్​లో చేర్చినా బీఆర్ఎస్​అభ్యంతరం చెప్పలేదు. పైగా ఏపీ కొత్తగా రాయలసీమ లిఫ్ట్​ఇరిగేషన్​పథకాన్ని చేపట్టి నీటిని తరలించుకోవడానికి ప్రయత్నిస్తే, అప్పటి బీఆర్ఎస్​సర్కార్ పూర్తిగా సహకరించింది.

అంతేగాకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు అనుమతి లేదని 2021 జులై 15న గెజిట్​నోటిఫికేషన్​ఇచ్చినా.. అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఆనాడే ప్రాజెక్టులపై కేఆర్ఎంబీకి పూర్తి అధికారాలను కేంద్రం ఇచ్చినా ఎందుకు నోరెత్తలేదు? అధికారంలో ఉన్న పదేండ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడేమో పోరాటం చేస్తామంటున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోరాటమేదో అప్పుడే కేంద్రంపై చేసి ఉంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. 

బాగోతం బయటపడ్తదనే: వంశీచంద్​రెడ్డి 

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్నదని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు వంశీచంద్​రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న రూ.లక్షల కోట్ల బాగోతం బయటపడ్తదన్న భయంతోనే కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘రాష్ట్రానికి 550 టీఎంసీలు రావాల్సి ఉన్నా.. దానికోసం కేసీఆర్​ ఏనాడూ పోరాడలేదు. 2014 నుంచి 2023 వరకు మొత్తంగా కేవలం 212 టీఎంసీలే వాడుకున్నారు. నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రాజెక్టుల పనులు పెండింగ్​లో ఉన్నాయి. ఆనాడు వైఎస్​ ప్రభుత్వం మొదలుపెట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు కేసీఆర్​హయాంలో రూపాయి కూడా విడుదల చేయలేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్​లకూ కేసీఆర్​ ఏనాడూ వెళ్లలేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్​నేతలకు తగిన బుద్ధి చెప్పారని, రానున్న పార్లమెంట్ ​ఎన్నికల్లోనూ బుద్ధి చెప్తారని అన్నారు.