రూ.190 కోట్లతో బాసర ఆలయ మాస్టర్ ప్లాన్..

రూ.190 కోట్లతో  బాసర ఆలయ మాస్టర్ ప్లాన్..
  • టెంపుల్ ను టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతాం
  • గోదావరి పుష్కరాల కోసం ప్రణాళికలు సిద్ధం
  • ట్రిపుల్ ఐటీని మరింత అభివృద్ధి చేస్తాం
  • విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దు
  •  జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి జూపల్లి 

నిర్మల్, వెలుగు:  బాసర సరస్వతి దేవి పుణ్యక్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అఅన్నారు.  రూ.190 కోట్లతో మాస్టర్ ప్లాన్​ను అమలు చేసి టెంపుల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. బుధవారం ఆయన నిర్మల్ జిల్లాలో పర్యటించారు. మొదట బాసర సరస్వతి దేవిని దర్శించుకుని పూజలు చేశారు. అనతరం కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆలయ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గోదావరి పుష్కరాల కోసం ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖలను సమన్వయం చేస్తామన్నారు. బాసర ఆలయ అభివృద్ధిపై దృష్టి పెడతానన్నారు. అనంతరం బాసరలో రూ.5.75 కోట్లతో చేపట్టే 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి బాసరలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.

ట్రిపుల్ ఐటీని సందర్శించిన మంత్రి...  

బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్​ను మంత్రి జూపల్లి సందర్శించారు. క్యాంపస్ లో రూ.1.70 కోట్లతో చేపట్టే మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒత్తిడికి గురికావద్దని, మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలన్నారు. సంగీతం, సాహిత్యంతో పాటు ఆటల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. మొబైల్స్​ వాడుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. 

క్యాంపస్​లో ఐటీ, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి వెంట సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, వైస్ ఛాన్స్​లర్ గోవర్ధన్ తదితరులున్నారు. సోన్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్​ను మంత్రి సందర్శించారు. స్కూస్​లో ఏర్పాటుచేసిన ఆస్ట్రానమీ ల్యాబ్​ను పరిశీలించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫొటో ఎగ్జిబిషన్​ను తిలకించారు. స్టూడెంట్లతో మాట్లాడుతూ శాస్త్రసాంకేతిక రంగాలపై మరింత అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఆస్ట్రానమీ ల్యాబ్​ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 

లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం 

నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్​ను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మల్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. నిర్మల్ పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మంత్రి జూపల్లి మహేశ్వర్ రెడ్డితో కలిసి  చెక్కులను పంపిణీ చేశారు.