
వికారాబాద్, వెలుగు: డ్రగ్స్ సంస్కృతి మంచిది కాదని, ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. వికారాబాద్‌లో కొత్తగా నిర్మించిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి తోపాటు ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.
కల్తీ కల్లు విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో, కాల్వ గట్లపై ఈత, తాటి, ఖజూర చెట్లను పెంచేందుకు నిధులు కేటాయించి, ప్రతి గ్రామంలో 5- నుంచి10 ఎకరాల్లో ఈ చెట్లను నాటేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ సమీపంలోని ఈ ప్రాంతం నీరా, కల్లు ఎగుమతిలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.